Tuesday, September 20, 2016

ప్రేమ ప్రతిపాదన












సరిహద్దు మీద పెద్దగా నమ్మకం లేదు నాకు.
కాశ్మీర్‌ అయితేనేం కాందహార్‌ అయితేనేం
సరిహద్దుల్ని అతిక్రమిస్తాయి కాబట్టి
పక్షులంటే యిష్టం నాకు.
పక్షి పైకి ఎగిరిన కొద్దీ దాని ముందు
సరిహద్దున్నీ వెలతెల పోతాయి.
ఎగిరి ఎగిరి పక్షి రెక్కలు
ఆకాశం హద్దుల్ని కూడా చెరిపేస్తాయి.
హీబ్రోన్‌ అయితేనేం హిరోషిమా అయితేనేం
అమితంగా ప్రేమిస్తారు కాబట్టి
పిల్లలంటే యిష్టం నాకు.
అయితే యీ మట్టి దార్ల మీద
నలిగిపోయిన పసి పాదాల గుర్తులేంటి?

ఎవరు బాబూ
మాటలు రాని పసిపాపలకు
యుద్ధ పాఠాలు బోధిస్తున్నారు.
తప్పటడుగుల పిల్లలకు
ఆయుధాల్ని కానుకగా పంచుతున్నారు.

గోడల మీద కూడా పెద్ద నమ్మకం లేదు నాకు
బెర్లిన్‌ గోడ అయితేనేం చైనా గోడ అయితేనేం,
గోడ మధ్య నించీ మొులుచుకొచ్చే
మొక్కలంటే యిష్టం నాకు.
మొక్క నిట్టనిలువుగా ఎదిగి
ఆకాశంతో చెలిమి చేస్తుంది
ఎదిగి ఎదిగి
విశ్వాంతరాళం అవతలికి
తన ప్రేమ సందేశాలు పంపుతూ వుంటుంది.

కొన్ని సరిహద్దు ఆ మహా చక్రవర్తుతోనే అంతరించాయి.
మరికొన్ని ఆ మహా చక్రవర్తులనే అంతమొందించాయి.

ప్రపంచ పటంలో చెరిగిన గీత స్థానంలో
కొత్త గీతల్ని చూస్తున్నాం.
కొత్త గీత నించి పుట్టిన
సరికొత్త ఆయుధాల్నీ యుద్ధాల్నీ చూస్తున్నాం.
సరిహద్దులూ యుద్ధాలూ
ఆయుధాలూ లేని ప్రపంచం కోసం కలలు కంటాను.

ఎప్పటికయినా సరే చూస్తుండండి
ప్రపంచంలో పక్షులన్నిటినీ ఏకం చేసి
సరిహద్దున్నిటినీ చెరిపేస్తాను.
కాశ్మీర్‌ అయితేనేం కాందహార్‌ అయితేనేం
పిల్లలందర్నీ కూడదీసి
కొత్త ప్రేమ ప్రపంచం స్థాపిస్తాను.

రచన : ఆకెళ్ళ రవిప్రకాష్
' ప్రేమ ప్రతిపాదన ' కవితా సంపుటి నుంచి

No comments:

Post a Comment