Wednesday, September 21, 2016

నువూ నేనూ కాలానికి తలో చివరా…






















12-ఏప్రిల్-2013

ఈ నాలుగు పదుల బాల్యం
ఇలాగే కరిగిపోతుంది.

ఉదయాలూ సాయంత్రాలూ
కాలం కొండని కరగదీస్తుంటాయి.

పాదముద్రలన్నీ తీరమ్మీద
మళ్ళీ సంతకాలు చేస్తూనే వుంటాయి.

ఇరానీ టీ కప్పుల్లోకి
నిరుద్యోగాన్ని వడపోసుకుంటూ
విఫల ప్రేమ కథల గురించి
తెల్లారే వరకు
నువు తడిమిన గాయాల చిరునామాలు
నా కళ్ల వెనక ఇంకా వేలాడుతూనే వున్నాయి.

ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో
ఎవరికి తెలుసు?
చెరిగిపోయిన స్వప్నాల్లోంచి
చెరగని గాయాల్లోంచీ
రాయని లేఖల్లోంచీ
మిగిలిన సెల్ఫోన్ కబుర్లలోంచీ
మనమంతా విడివిడిగా
ప్రపంచానికి తలో మూలకి.

నాలోపలి నీతో
మగతలోనో, మెలకువలోనో
మళ్ళీ సంభాషణ మొదలెడతాను
ఒక్కోసారి అసలు నేనెవరో
నువ్వెవరో గుర్తుపట్టలేనంతగా
నీలోకి కోల్పోతాను.

ఒక్కోసారి లోపలి సంభాషణలోంచి
సప్తసముద్రాలూ ఈది
నీ దగ్గిరకి నడిచి వస్తాను.

అసలు ఇలాగే
నీ అనుభవంలో
నిన్ను నువ్వు నాలోకి,
అందరిలోకీ
గుర్తుపట్టలేనంతగా
కోల్పోడం జరుగుతుందా?

ఈ ప్రశ్నకి సమాధానం
వెతుక్కుంటూ
నేను
భూగోళాన్నవుతాను.
నింగినవుతాను
కాలాన్నవుతాను

నువూ నేనూ
కాలానికి తలో చివరా
లంగరేసి
నాలుగు పదుల గాయాల్ని
కొత్తగా దర్శిస్తూ.


(అఫ్సర్ కీ … ఏప్రిల్ 11 కీ )
Painting: Mandira Bhaduri (University of Chicago)

ఈ మధ్యాన్నం..

- 


సగం తీరం మీదా
సగం రాళ్ళ మీదా
ఆరేసిన తెల్లని ఎండ దుప్పటి

నీళ్ళలోకి సగం కూలిన పురావంతెన
గతాన్ని మళ్ళీ అరగదీస్తూ అలలు

నే కోల్పోయిన రోజులు
నన్ను బంధించిన రోజులు

అతివేగంగా దరిచేరుతున్న మరోవేసవి
ఇంకా ఎవరూ కట్టని నగరాల గురించీ
రాయని కావ్యాల గురించీ
దీర్ఘంగా ఆలోచిస్తూ సముద్రం


మధ్యాన్నం

కొంచెం చలిగా
కొంచెం వెచ్చగా
మహా బద్ధకంగా.


22-మార్చి-2013


Follow : https://www.facebook.com/akellaraviprakash

విమానం పద్యాలు

Art: Mandira Bhaduri























1

ఆకాశంలోకి ఎగురుతూ విమానం

పాటలోకి ఎగురుతూ నేను.

2

నను ఇంత దగ్గరగా చూసి

విస్తుపోయిన మేఘాలు

3

ఆకాశంలో ఒకడే చంద్రుదు

సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు

4

వీధి దీపాల్ని మెళ్ళొ వేసుకొని

మాయద్వీపంలా వెలుగుతూ నగరం

తళుకులీనుతూ పైన పాలపుంత

మధ్యలొ తేలుతూ నేను

5

ఉచితంగా నాతో

ఫ్రయాణిస్తున్న ఒక సాలీడు

6

మహా నగరాన్ని

నిమిషంలో దాటిన విమానం

నా కలల్ని దాటి కూడా పోగలదా?

7

వర్షంలోంచి

వర్షంలోకి


కప్పలా దూకిన విమానం

- ఆకెళ్ళ రవిప్రకాష్
JULY 27, 2016

Follow :  https://www.facebook.com/akellaraviprakash/

స్వప్న నగరం

 


నేనొక స్వప్నం చూసాను
ఆ స్వప్నంలొ ఒక నగరం చూసాను
అక్కడ సైన్యాలు లేవు
ఎవరి భుజాల మీద తుపాకులు లేవు
కత్తుల గురించి
కవాతుల గురించి
బాంబుల గురించి
ఆలోచనల్లేవు
ఆవేదనల్లేవు
పిల్లల్ని సైన్యంలోకి
చేర్చడం లేదు
సైనికుల శరీరాల మీద
జాతీయ జెండా కప్పడం లేదు
యుద్ధ కధల్ని పిల్లలకి చెప్పడం లేదు
అటువంటి
ప్రేమ ప్రపంచంలోకి
భూగోళం ఎగరడం చూసాను
అటువంటి
భవిష్య నగరంలోకి
నేను మళ్ళీ పుట్టడం చూసాను
ప్రేమలోకి
స్వేఛ్ఛలోకి
ప్రతి మనిషి ఎగరడం చూసాను
నేనొక స్వప్నం చూసాను-
* SARANGA- Jan. 21, 2016

Follow : ఆకెళ్ళ రవిప్రకాష్