Friday, September 23, 2016

ప్రేమ మటుకే…

నేను నిరాశగా
ఆనందం నించీ బహిష్క్రుతుణ్ణయి వున్నపుడు
ఎల్లపుడూ
ప్రేమ మటుకే
తనదారుల్ని తెరిచింది.
అందుకే నేననుకుంటాను
ప్రేమ మటుకే బ్రతికించగలదని.

బిడియాలని
సంకోచాలని విడిచి
ప్రేమలోకి ఎగరడానికి
ధైర్యం చేయగలిగితే
మనమంటే ఏమిటొ
వెలుగంటే ఏమిటొ
ప్రేమ మటుకే తేటతెల్లం చేస్తుంది

నిజానికి ప్రేమించడం అంటే
మన చుట్టూ మనం నిర్మించుకున్న

కారాగారాల గోడల్ని కూల్చడమే!
- ఆకెళ్ళ రవిప్రకాష్ 
ప్రచురణ :  సారంగ

వెన్నెల తీరం


విశాఖ నగర పద్యాలు


పక్షులన్నీ ఎగిరిపోయాయి
ఒంటరి మేఘం వేళాడుతోంది
నగరం
నేనూ
కొండలూ
ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ-
జన్మ జన్మల దుఃఖాల్ని
కడుక్కోడానికి
ఒక్కరాత్రి నగ్నంగా
ఈ ఒంటరి కొండల మీద
వెన్నెల్ని చూస్తూ వుండిపోతే చాలేమో-

వడగాడ్పు
నగరాన్ని
దహించినపుడు
నడిరాతిరి
కురిసిన వాన
పిల్లల ఏడుపుల్ని
కలల్లోకి జోకొట్టింది

ఓడలూ
పడవలూ
అలలూ
అటూ యిటూ తిరుగుతూ-
ఒక కొంగల బారు
ఆవెనక
చల్లని గాలి
వర్షం
అన్నీ నను తడిపేస్తూ-

తీరం మీద
తేలాడుతున్న
పాటలన్నిటికీ
నేపధ్యం నా బాల్యమే.

సగం మేఘం
సగం పొగమంచు
గాలి వేల మైళ్ళనించి
విసురుగా వీస్తూ-
స్వర్గం కొండ మధ్యలోంచి
ఉదయించిన చంద్రుడు

నువ్వడుగుతావు ఎలా వున్నావని?
రాత్రిని కౌగిలించుకుని
హోరుగాలిని వింటున్నాను.
కాసేపు ఆలోచనలు
కాసేపు శూన్యం
విరబూసిన పూలు
నేల రాలిపోతున్నాయి.
తలక్రిందికి దింపి చూస్తే
అక్కడంతా
నాతో నడుస్తూ
మిత్రుల జ్ఞాపకాలు.

స్నేహితుల ప్రేమ కన్నా
ఎక్కువ దూరం
ఈ నగరం విస్తరించగలదా?

తీరంలో విడిపోతున్న మిత్రులు
వీడుకోలు పాటలు పాడుకుంటున్నారు
నే వదిలి వచ్చిన నగరాలు
కోల్పోయిన స్నేహాలు-
నడిచి వచ్చిన దారిలో
చంద్రుడూ
వెన్నెలా
సముద్రం తప్ప మిగిలిందేముంది?

-            ఆకెళ్ళ రవిప్రకాశ్‌  

(ప్రచురణ : ఆంధ్ర జ్యోతి) 

09-08-2015