Tuesday, August 1, 2017

కవిత్వం - దుఃఖం తర్వాత - ఆకెళ్ళ రవి ప్రకాష్

దుఃఖం గట్టిగా నీ ఇంటి తలుపు కొట్టే
సమయం ఆసన్నమైంది.
తలుపు తెరచి నిన్ను నువ్వే
లోపలికి ఆహ్వానిస్తావు.
కుశల ప్రశ్నలు అయ్యాక
ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు
మాట్లాడుకుంటారు
ఇప్పటిదాకా అపరిచితంగా మెలిగిన
నీ ముందు నువ్వే
నీ లోపలి గాయాల్ని
అన్నిటినీ విప్పుకుంటావు.
నీ జీవితాంతం
ఎవరు నువ్వు కాదు అని
తప్పించుకు తిరిగావో
అది ఎవరో కాదు నువ్వే
అని తెలుసుకున్న యీ రోజు
నువు రాసుకున్న ఉత్తరాలు
సమస్త కవిత్వం
గీసిన బొమ్మలు
తీసిన చిత్రాలు
అన్నిటితో సహా
అద్దంలోంచి నీ బొమ్మ
చిరిగిపోయినపుడు
ఇవాళ
కూర్చుని దర్శించు
జీవితాన్ని మళ్ళీ కొత్తగా…

- ఆకెళ్ళ రవి ప్రకాష్
( వాకిలి సాహిత్య పత్రిక 02 - 08 - 2017 )