Sunday, October 9, 2016

వైయ్యక్తికం నుంచి సామూహికం దాకా విస్తరించిన కవిత్వం - ఎం. నారాయణ శర్మ

కవిత్వం భౌతికమా? అభౌతికమా? అధి భౌతికమా? అన్న ప్రశ్నలకు ఏదో ఒక కవితనో, కావ్యాన్నో పట్టుకుని అది పైవాటిలో ఏ మార్గానికి చెందుతుందో చెప్పవచ్చు. లేదా కొందరు కవుల కవిత్వాన్ని విశ్లేషించి నిర్ణయించవచ్చు. కాని అన్ని కాలాల్లో అన్ని మార్గాల కవిత్వానికి వర్తించే అంశాన్ని నిర్ణయించడం కష్టం. దానికి కారణం ఈ మూడు కవిత్వాన్ని ఎక్కడో ఒక చోట పెనవేసుకుని ఉండటం. ఆకెళ్ళ రవిప్రకాష్‌ లాంటి వాళ్ళకవిత్వాన్ని చూసినప్పుడు ఈ అంశం పున:రూఢి అవుతుంది కూడా...
ప్రాచీన కావ్యమీమాంస అలౌకిక వ్యాపారాలను గురించి చెప్పింది. సాధారణ, ధారణ, మనన, చర్వణ, సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు. సాధారణ ఒక భౌతిక దృశ్యం, ధారణ భౌతికంలోంచి తీసుకున్న దృశ్యాంశం. మనన దృశ్యపు పునరావృత్తి. చర్వణ పునరనుభవం. సృజన కళాత్మక వ్యాపారం. ఈ ఐదు దశలో పాఠకుడికి చేరేది సృజన. మిగతా నాలుగు దానికి పూర్వాంశాలు. భౌతిక, అభౌతిక, అధిభౌతిక మార్గాల్లో చూస్తే మొదటి రెండు భౌతికానికి, మధ్య రెండు అభౌతికానికి, చివరి అంశం అధిభౌతికానికి చెందింది. అయినా వీటికి భౌతికమే పాదం. అనేక వలయాలు వలయాలుగా కళగా, సృజనగా ఆకెళ్ళ రవిప్రకాష్‌లో వ్యక్తమౌతున్నవి కూడా ఇవే. అనేకసార్లు పరిపూర్ణమైన సృజన దశలో. ఒకింత అస్పష్టంగా, కొన్ని స్పష్టమైన భౌతికాంశాలుగా కనిపించడంలోని కారణమూ ఇదే. 
ఈ కవిత్వంలో గమనింపదగిన అంశాలు కొన్ని ఉన్నాయి. భౌతికాంతరత (జూష్ట్రyరఱషaశ్రీ ణఱర్‌వఅషవ) ఎడ్వర్డ్‌ బుల్లో ప్రతిపాదించిన ఈ కళా సిద్ధాంతం. భౌతిక వాతావరణంలోని నిరాసక్తతను ఆసక్తివైపుకి, నిశ్చేష్టను చైతన్యం వైపుకి మరలుస్తుంది. అనేక కవితల్లో ఈ అంశం వెల్లడి అవుతుంది. ఈ కవిత్వానికి 'నగరం' ఒక కేంద్రం. కాని ఇందులో కోల్పోతున్న దాన్ని పొందాలనే సంఘర్షణ. నిరాపేక్షంగా వర్తమానాన్ని అనుభవించడం ధ్వనిస్తుంది. ప్రధానంగా స్వేచ్ఛను కోరుకునే, ప్రతిపాదించే, సమర్థించే గొంతుక స్పష్టంగా కనిపిస్తుంది. శైలీగతంగా దర్శనాన్ని చూస్తే రవిప్రకాష్‌ ఏ దృశ్యాన్ని కత్తిరించుకోరు. ఏ అంశాలు ఎదురైతాయో వాటిని అంతే ఆప్యాయంగా అనుభవిస్తారు.
''సాగన్‌/ న్‌ అనేకానేక మలుపుల్లోకి / దేవతల సాక్షిగా / నన్ను నేను వెతుక్కుంటూ/ నన్నీ ఇసక రేణువుల్లో ఒకటిగా స్పృశించు'' (విన్నపాలు వినవలె - 68పే. ప్రేమ ప్రతిపాదన)
''ఉదయం మళ్ళీ / ఉన్నట్టుండి మళ్ళీ మొదలవుతుంది / ఇక ఈ మట్టిమీద మొదటిసారి / అడుగుపెట్టిన క్షణపు / జ్ఞాపకాలన్నీ నన్ను చుట్టుముడతాయి''
- (వర్షంలో నగరం - 24పే. - ప్రేమ ప్రతిపాదన)
'ఈ నిరంతర ప్రయాణంలో / ఇది ఎన్నో మజిలీయో గుర్తులేదు / అదే అపరిచిత జ్ఞాపకంలోకి / మళ్ళీ మళ్ళీ సాహసం/ వలయాలు వలయాలుగా సాగే ప్రయాణం''
- ( అపరిచిత జ్ఞాపకం - పే 22. ఇసకగుడి)
ఇసుక రేణువుల్లో ఒకటిగా ఉండటం, జ్ఞాపకాలు చుట్టుముట్టడం, వలయాలు వలయాలుగా ప్రయాణం ఇవన్నీ రసానుభూతి (Aవర్‌ష్ట్రవ్‌ఱష టవవశ్రీఱఅస్త్ర)ను ప్రకటిస్తున్నాయి. బుల్లో సిద్ధాంతాన్ని ఉదహరిస్తూ సంజీవదేవ్‌ ''రసానుభూతికి ఉపయోగంతో సంబంధం లేద''ని చెప్పారు. ఈ వాక్యాల్లో వర్తమానం, దానితోపాటు గతం, గతానుగతాన్ని అనుభవించడం కనిపిస్తుంది. ఈ అనుభవాన్ని రవిప్రకాష్‌ భౌతికాన్నుంచేదుకుంటారు. 
వైయ్యక్తికం, సామూహికం వేరుకానట్టే, భౌతికం, మానసికం వేరు కాదు. మానవ సంస్కృతి ఒక జీవన భాగాన్ని అనుభవిస్తుంది. అది తను జీవించే కాలానికి కాస్త ముందు, వెనకలుగా విస్తరించి అర్థం చేసుకుంటుంది, తనను అందులో సంలీనం చేసి, ఆ వాతావరణాన్ని తనలో సంలీనం చేసుకుంటుంది. మనో వైజ్ఞానిక శాస్త్రం ఈ సాంస్కృతిక సాపేక్షతా సిద్దాంతాన్ని పరిచయం చేసింది .కళ, సాహిత్యం, సంగీతం, యాంత్రిక కల్పనలు అవి పుట్టిన సంస్కృతి నుంచే అంచనా వేయగలం గాని, కేవలార్ధంతో విలువలను నిర్ణయించలేమని ఈ వాదం చెప్పింది. ఈ నిర్ణయానికి ఒక సమూహం ఆధారం. మనో విశ్లేషణలో సాంస్కృతిక సమూహం అనే పదాన్ని వాడుతారు. ఒక సమూహంగా విశిష్టంగా పరిగణింపబడే ప్రజాసమూహం. ఆకెళ్ళ కవిత్వంలో ఈ అంశం కనిపిస్తుంది. ఇలాంటి సమూహాలకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడం అనేక చోట్ల కనిపిస్తుంది.
1. ''అన్ని మజిలీలు పూర్తి చేసుకుని / చివరి తీరాన్ని వెదుక్కుంటూ / ఇక్కడ ఉదయిస్తాడు అరవిందుడు''
2. ''అంతే పరధ్యానంగా / తనవంకే చూస్తున్న సముద్రాన్ని / తుదకంటూ యీది / ఇక్కడే అస్తమిస్తాడు అరవిందుడు'' - (పే. 28. ఇసక గుడి)
3. ''విగ్రహ మాత్రంగా మిగిలిపోతాడు గాంధీ''
4. ''సుబ్రహ్మణ్య భారతి కూడా / అలా అక్షరాలను పేర్చుకుంటూ అలా అపరిచితంగా వెళ్ళిపోయి ఉంటాడు''
( అపరిచిత జ్ఞాపకం - పే. 29 - ఇసకగుడి)
5. ''ఒక మహా గాయకుడు ప్రత్యక్షమౌతాడు / ఒక మహా చక్రవర్తి హుంకరిస్తాడు / ఒక ఆదిమ మానవుడు నృత్యం చేస్తాడు / అలక్‌ నిరంజన్‌ నుంచి బౌద్ధ భిక్షువు దాక / అందరూ వాళ్ళ కథలు చెప్పుకుని వెళ్ళిపోతారు''
- (కవిత్వం కురిసిన రాత్రి - 84పే. ఇసకగుడి)
6. ''ఇప్పుడే చెట్టు వర్షం కురిసినప్పుడల్లా / స్మృతుల్ని మనందరి మీదా చిలకరిస్తుంది'' - (వర్షంలో చెట్టు పే. 91)
7. ''కవి భౌతికంగా మరణించి / నా లోపలి ప్రేమలోకి జన్మనెత్తాడు / స్పటిక చంద్రుడే. ఆకురాలిన చెట్టు కొమ్మల్నీ / నా గది కిటికీలోంచి చూస్తూ సముదాయిస్తాడు'' - (అనంతం - 39 - ప్రేమ ప్రతిపాదన)
ఈ వాక్యాలు ఎక్కువ వరకు కవులకు, వాళ్ళ జీవితాలకు కవిత్వానికిసంబంధించినవే. ఐదవ వాక్యాంశాలు అనిర్దిష్టంగా విశ్వభావనను కలిగిస్తాయి. చివరి రెండు పరోక్షంగా 'ఇస్మాయిల్‌'ను చూపుతాయి. ఆకెళ్ళ కవిత్వంలో ఇలాంటివి అధికం. సుమారుగా నగరం, ఊరు, కొందరు వ్యక్తులు మినహాయించి ఇతరత్రా ఉండే కవిత్వం చాలా తక్కువ. ఓ మహాత్మా (27), కిషోర్‌ నీ పాట (27), చరఖా సంగీతం (84), దీపశిఖ (104), ద్విఖండిత (29), పాతగాయం (72) మొదలైన 'ప్రేమ ప్రతిపాదన'లోని కవితలు. నిరంతర యాత్ర (95) కవిత్వం కురిసిన రాత్రి, వర్షంలో చెట్టు (95) మొదలైన ఇసకగుడిలోని కవితలు ఈ మార్గానికి చెందినవే. నిజానికి వీళ్ళందరి ఊహల్లోకి జీవితాల్లోకి, మార్గాల్లోకి, ప్రవర్తనల్లోకి సాంస్కృతిక సాంశీకరణ (షబ్‌బతీaశ్రీ aరరఱఎఱశ్రీa్‌ఱశీఅ) చెందుతారు కవి. వాళ్ళనను ఆహ్వానిస్తారు. నగరాలు, సముద్రం అందుకు మినహాయింపు కాదు. వీటిలో కనిపించే సాంశీకరణ, అధి స్వదేశీయత (ఎవ్‌a అశీర్‌aశ్రీస్త్రఱa) లక్షణాల్లో కనిపిస్తుంది.
నిర్మాణగతంగా ఆకెళ్ళ కవిత్వం అధిభౌతికంగా, భౌతికంగా (జూష్ట్రyరఱషaశ్రీ)గా, కళా వాతావరణాన్ని ఆనుకుని కొన్నిసార్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు వర్తమానాన్ని, కాలాన్ని దాటి మాట్లాడటం వల్ల ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. కాలాన్ని వర్తమానాన్ని దాటడం అంటే ఒక్కోసారి గొంతుక జన్మకు కూడా దాటి పురాస్మృతుల నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపించడం వల్ల ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఊహ మాత్రమే. ఫ్రాయిడ్‌ మనసుకు మూడు అంతరాలు అహం (వస్త్రశీ) బుద్ధి (రబజూవతీ వస్త్రశీ) చిత్తం (ఱస) ఉంటాయని వాటిలో కళ చిత్తం నుంచి అతార్కికత, అదృశ్యశక్తిని పొందుతుంది. దీన్ని ప్రేరణ అంటున్నాం. ఐక్యత, గుణీకరణలను అహం నుంచి, ఆధ్యాత్మిక ఆశయాలు, ఆదర్శాలను బుద్ధి వల్ల పొందుతుంది. ఆధ్యాత్మికత కనిపించడం బుద్ధి వల్లనే. కవిత్వ కళలో కనిపించే భావావేశ స్థితి (ఱఅరజూఱతీa్‌ఱశీఅ) చుట్టూ ఒక దివ్యానందం అంగీకారం, తిరస్కారం ఇవన్నీ ఉన్నాయి. ఆకెళ్ళలోనూ అందుకు ఉదాహరణలున్నాయి. ఇవి సందర్భగతమైనవి.
''అలా నెమ్మదిగా ఉదయాల్లోకి సాగిపో / చేప నీళ్ళలోనే ఉండనీ / పళ్ళని చెట్టుకే మిగలనీ / ఎవరికీ కరచాలనం చెయ్యకు'' (ఇసకగుడి. పే. 16)
''ఒక్కసారి మనసంతా అంధకార బంధురమయిపోతుంది // ఒకటే నిస్సహాయత ఒకటే దైన్యత'' - (కనబడని రేఖా చిత్రం - 35. ఇసకగుడి)
''కాశ్మీర్‌ అయితేనేం కాందహార్‌ అయితేనేం / సరిహద్దుల్ని అతిక్రమిస్తాయి కాబట్టి / పక్షులంటే ఇష్టం నాకు'' 
- (ప్రేమ ప్రతిపాదన - 1 పే)
ఈ వాక్యాలు అంగీకార తిరస్కారాలను ప్రసారం చేస్తాయి. వాక్యాలను అలంకారికంగా చెప్పడం, ధ్వన్యాత్మకంగా చెప్పడం లాంటి అంశాల్లోనూ వైవిధ్యం ఉంటుంది. అలాంటి వాక్యాలు అనేకంగా ఏరి రాయవచ్చు. చాలాసార్లు నగరాన్ని 'సముద్రం' 'ఆమె (స్త్రీ)' అనే ప్రతీకల ద్వారా చిత్రిస్తారు. రెండు భిన్న కాలాలు ఉంటాయి. ఒక రాత్రి కాలం లేదా ఉదయం. ''రాత్రి, సూర్యుడు, ఉదయం సముద్రం. మూసిన కళ్ళు'' ఇలాంటి సంకేతాంశాలు అన్నీ ఒక ఆర్కిటైపికల్‌ ఎట్మాస్పియర్‌ని కవిత్వానికిస్తాయి. కొన్నిసార్లు ఊహలు, భావ చిత్రాలు కళాత్మక దృష్టిని ప్రసారం చేస్తాయి. 
''ఆకాశం కాగితం మీద మబ్బుల్ని / రచిస్తుంటాయి కొబ్బరి చెట్టు / ఒకరెక్క ఇటు వాల్చి / సముద్రం స్తనాల మీద / తల వాల్చుకు పడుకుంటాయి పడమటి కొండలు''
- (నుదుటిమీద సూర్యోదయం - 80 పే. ఇసకగుడి)
''ఇక్కడ ఆకాశం కాన్వాసు మీదగా ఎగిరే / ఓ తెల్ల కొంగల బారు / సాయంత్రపు మబ్బు తునకల్ని మోసుకొస్తుంది''
- (నదీముఖద్వారం - 77పే.)
సాధారణంగా కళా సౌందర్యం రెండు శ్రేణుల నుంచి కవి గ్రహిస్తాడు. 1. సేంద్రియ (శీతీస్త్రaఅఱష) ప్రాణుల్లో గోచరించేది. 2. నిరింద్రియ (ఱఅశీతీస్త్రaఅఱష) ప్రాణేతరాలయిన నదులు, కొండల్లో కనిపించేది. రెండు వైపుల నుంచి కవులు భావ చిత్రాలను అందిస్తారు. ఆకెళ్ళ దీనికి మినహాయింపు కాకపోయినా రెంటి మధ్య బలమైన సంబంధాన్ని సృజన ద్వారా కలిగించడం కనిపిస్తుంది. కాలరిడ్జ్‌ ''ప్రకృతిలోని రూపాలనెంత నిర్దుష్టంగా కాపీ చేసినా, శబ్దాత్మకంగా చెప్పినా అవి విలక్షణతను చెప్పవు. బలమైన కోరిక చేత అవి మార్పు చేయబడితేనే అది అతని ఊహాశాలితకు నిదర్శనం' అన్నాడు. ఈ సేంద్రియ, నిరింద్రియ కళలకు, సౌందర్యానికి మధ్య వ్యత్యాసాన్ని దూరం చేసే మార్పు పై వాక్యాల్లో ఉంది. క్రియలను వైవిధ్యంగా కూర్చడం వల్ల ఈ గుణారోపణ సాధ్యమయింది. చివరి వాక్యాల్లో రోడ్డును భిన్న కోణాల్లో నిర్వచించడంలోనూ ప్రతిభా సమన్వయం కనిపిస్తుంది.
వస్తుగతంగా, శిల్పగతంగా, కళాగతంగా సాధారణ కవితా స్రవంతి నుంచి ఆకెళ్ళ రవిప్రకాష్‌ కవిత్వం తన ఉనికిని నిలబెట్టుకుంటుంది. శైలి, మనో వైజ్ఞానిక భూమికల ఆధారంగా విశ్లేషణ ముందుకెళితే ఈ తరహా కవుల అభివ్యక్తి లోతుల్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు.
- ఎం. నారాయణ శర్మ, 9177260385

Friday, September 23, 2016

ప్రేమ మటుకే…

నేను నిరాశగా
ఆనందం నించీ బహిష్క్రుతుణ్ణయి వున్నపుడు
ఎల్లపుడూ
ప్రేమ మటుకే
తనదారుల్ని తెరిచింది.
అందుకే నేననుకుంటాను
ప్రేమ మటుకే బ్రతికించగలదని.

బిడియాలని
సంకోచాలని విడిచి
ప్రేమలోకి ఎగరడానికి
ధైర్యం చేయగలిగితే
మనమంటే ఏమిటొ
వెలుగంటే ఏమిటొ
ప్రేమ మటుకే తేటతెల్లం చేస్తుంది

నిజానికి ప్రేమించడం అంటే
మన చుట్టూ మనం నిర్మించుకున్న

కారాగారాల గోడల్ని కూల్చడమే!
- ఆకెళ్ళ రవిప్రకాష్ 
ప్రచురణ :  సారంగ

వెన్నెల తీరం


విశాఖ నగర పద్యాలు


పక్షులన్నీ ఎగిరిపోయాయి
ఒంటరి మేఘం వేళాడుతోంది
నగరం
నేనూ
కొండలూ
ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ-
జన్మ జన్మల దుఃఖాల్ని
కడుక్కోడానికి
ఒక్కరాత్రి నగ్నంగా
ఈ ఒంటరి కొండల మీద
వెన్నెల్ని చూస్తూ వుండిపోతే చాలేమో-

వడగాడ్పు
నగరాన్ని
దహించినపుడు
నడిరాతిరి
కురిసిన వాన
పిల్లల ఏడుపుల్ని
కలల్లోకి జోకొట్టింది

ఓడలూ
పడవలూ
అలలూ
అటూ యిటూ తిరుగుతూ-
ఒక కొంగల బారు
ఆవెనక
చల్లని గాలి
వర్షం
అన్నీ నను తడిపేస్తూ-

తీరం మీద
తేలాడుతున్న
పాటలన్నిటికీ
నేపధ్యం నా బాల్యమే.

సగం మేఘం
సగం పొగమంచు
గాలి వేల మైళ్ళనించి
విసురుగా వీస్తూ-
స్వర్గం కొండ మధ్యలోంచి
ఉదయించిన చంద్రుడు

నువ్వడుగుతావు ఎలా వున్నావని?
రాత్రిని కౌగిలించుకుని
హోరుగాలిని వింటున్నాను.
కాసేపు ఆలోచనలు
కాసేపు శూన్యం
విరబూసిన పూలు
నేల రాలిపోతున్నాయి.
తలక్రిందికి దింపి చూస్తే
అక్కడంతా
నాతో నడుస్తూ
మిత్రుల జ్ఞాపకాలు.

స్నేహితుల ప్రేమ కన్నా
ఎక్కువ దూరం
ఈ నగరం విస్తరించగలదా?

తీరంలో విడిపోతున్న మిత్రులు
వీడుకోలు పాటలు పాడుకుంటున్నారు
నే వదిలి వచ్చిన నగరాలు
కోల్పోయిన స్నేహాలు-
నడిచి వచ్చిన దారిలో
చంద్రుడూ
వెన్నెలా
సముద్రం తప్ప మిగిలిందేముంది?

-            ఆకెళ్ళ రవిప్రకాశ్‌  

(ప్రచురణ : ఆంధ్ర జ్యోతి) 

09-08-2015

Wednesday, September 21, 2016

నువూ నేనూ కాలానికి తలో చివరా…






















12-ఏప్రిల్-2013

ఈ నాలుగు పదుల బాల్యం
ఇలాగే కరిగిపోతుంది.

ఉదయాలూ సాయంత్రాలూ
కాలం కొండని కరగదీస్తుంటాయి.

పాదముద్రలన్నీ తీరమ్మీద
మళ్ళీ సంతకాలు చేస్తూనే వుంటాయి.

ఇరానీ టీ కప్పుల్లోకి
నిరుద్యోగాన్ని వడపోసుకుంటూ
విఫల ప్రేమ కథల గురించి
తెల్లారే వరకు
నువు తడిమిన గాయాల చిరునామాలు
నా కళ్ల వెనక ఇంకా వేలాడుతూనే వున్నాయి.

ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో
ఎవరికి తెలుసు?
చెరిగిపోయిన స్వప్నాల్లోంచి
చెరగని గాయాల్లోంచీ
రాయని లేఖల్లోంచీ
మిగిలిన సెల్ఫోన్ కబుర్లలోంచీ
మనమంతా విడివిడిగా
ప్రపంచానికి తలో మూలకి.

నాలోపలి నీతో
మగతలోనో, మెలకువలోనో
మళ్ళీ సంభాషణ మొదలెడతాను
ఒక్కోసారి అసలు నేనెవరో
నువ్వెవరో గుర్తుపట్టలేనంతగా
నీలోకి కోల్పోతాను.

ఒక్కోసారి లోపలి సంభాషణలోంచి
సప్తసముద్రాలూ ఈది
నీ దగ్గిరకి నడిచి వస్తాను.

అసలు ఇలాగే
నీ అనుభవంలో
నిన్ను నువ్వు నాలోకి,
అందరిలోకీ
గుర్తుపట్టలేనంతగా
కోల్పోడం జరుగుతుందా?

ఈ ప్రశ్నకి సమాధానం
వెతుక్కుంటూ
నేను
భూగోళాన్నవుతాను.
నింగినవుతాను
కాలాన్నవుతాను

నువూ నేనూ
కాలానికి తలో చివరా
లంగరేసి
నాలుగు పదుల గాయాల్ని
కొత్తగా దర్శిస్తూ.


(అఫ్సర్ కీ … ఏప్రిల్ 11 కీ )
Painting: Mandira Bhaduri (University of Chicago)

ఈ మధ్యాన్నం..

- 


సగం తీరం మీదా
సగం రాళ్ళ మీదా
ఆరేసిన తెల్లని ఎండ దుప్పటి

నీళ్ళలోకి సగం కూలిన పురావంతెన
గతాన్ని మళ్ళీ అరగదీస్తూ అలలు

నే కోల్పోయిన రోజులు
నన్ను బంధించిన రోజులు

అతివేగంగా దరిచేరుతున్న మరోవేసవి
ఇంకా ఎవరూ కట్టని నగరాల గురించీ
రాయని కావ్యాల గురించీ
దీర్ఘంగా ఆలోచిస్తూ సముద్రం


మధ్యాన్నం

కొంచెం చలిగా
కొంచెం వెచ్చగా
మహా బద్ధకంగా.


22-మార్చి-2013


Follow : https://www.facebook.com/akellaraviprakash

విమానం పద్యాలు

Art: Mandira Bhaduri























1

ఆకాశంలోకి ఎగురుతూ విమానం

పాటలోకి ఎగురుతూ నేను.

2

నను ఇంత దగ్గరగా చూసి

విస్తుపోయిన మేఘాలు

3

ఆకాశంలో ఒకడే చంద్రుదు

సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు

4

వీధి దీపాల్ని మెళ్ళొ వేసుకొని

మాయద్వీపంలా వెలుగుతూ నగరం

తళుకులీనుతూ పైన పాలపుంత

మధ్యలొ తేలుతూ నేను

5

ఉచితంగా నాతో

ఫ్రయాణిస్తున్న ఒక సాలీడు

6

మహా నగరాన్ని

నిమిషంలో దాటిన విమానం

నా కలల్ని దాటి కూడా పోగలదా?

7

వర్షంలోంచి

వర్షంలోకి


కప్పలా దూకిన విమానం

- ఆకెళ్ళ రవిప్రకాష్
JULY 27, 2016

Follow :  https://www.facebook.com/akellaraviprakash/

స్వప్న నగరం

 


నేనొక స్వప్నం చూసాను
ఆ స్వప్నంలొ ఒక నగరం చూసాను
అక్కడ సైన్యాలు లేవు
ఎవరి భుజాల మీద తుపాకులు లేవు
కత్తుల గురించి
కవాతుల గురించి
బాంబుల గురించి
ఆలోచనల్లేవు
ఆవేదనల్లేవు
పిల్లల్ని సైన్యంలోకి
చేర్చడం లేదు
సైనికుల శరీరాల మీద
జాతీయ జెండా కప్పడం లేదు
యుద్ధ కధల్ని పిల్లలకి చెప్పడం లేదు
అటువంటి
ప్రేమ ప్రపంచంలోకి
భూగోళం ఎగరడం చూసాను
అటువంటి
భవిష్య నగరంలోకి
నేను మళ్ళీ పుట్టడం చూసాను
ప్రేమలోకి
స్వేఛ్ఛలోకి
ప్రతి మనిషి ఎగరడం చూసాను
నేనొక స్వప్నం చూసాను-
* SARANGA- Jan. 21, 2016

Follow : ఆకెళ్ళ రవిప్రకాష్

Tuesday, September 20, 2016

ప్రేమ ప్రతిపాదన












సరిహద్దు మీద పెద్దగా నమ్మకం లేదు నాకు.
కాశ్మీర్‌ అయితేనేం కాందహార్‌ అయితేనేం
సరిహద్దుల్ని అతిక్రమిస్తాయి కాబట్టి
పక్షులంటే యిష్టం నాకు.
పక్షి పైకి ఎగిరిన కొద్దీ దాని ముందు
సరిహద్దున్నీ వెలతెల పోతాయి.
ఎగిరి ఎగిరి పక్షి రెక్కలు
ఆకాశం హద్దుల్ని కూడా చెరిపేస్తాయి.
హీబ్రోన్‌ అయితేనేం హిరోషిమా అయితేనేం
అమితంగా ప్రేమిస్తారు కాబట్టి
పిల్లలంటే యిష్టం నాకు.
అయితే యీ మట్టి దార్ల మీద
నలిగిపోయిన పసి పాదాల గుర్తులేంటి?

ఎవరు బాబూ
మాటలు రాని పసిపాపలకు
యుద్ధ పాఠాలు బోధిస్తున్నారు.
తప్పటడుగుల పిల్లలకు
ఆయుధాల్ని కానుకగా పంచుతున్నారు.

గోడల మీద కూడా పెద్ద నమ్మకం లేదు నాకు
బెర్లిన్‌ గోడ అయితేనేం చైనా గోడ అయితేనేం,
గోడ మధ్య నించీ మొులుచుకొచ్చే
మొక్కలంటే యిష్టం నాకు.
మొక్క నిట్టనిలువుగా ఎదిగి
ఆకాశంతో చెలిమి చేస్తుంది
ఎదిగి ఎదిగి
విశ్వాంతరాళం అవతలికి
తన ప్రేమ సందేశాలు పంపుతూ వుంటుంది.

కొన్ని సరిహద్దు ఆ మహా చక్రవర్తుతోనే అంతరించాయి.
మరికొన్ని ఆ మహా చక్రవర్తులనే అంతమొందించాయి.

ప్రపంచ పటంలో చెరిగిన గీత స్థానంలో
కొత్త గీతల్ని చూస్తున్నాం.
కొత్త గీత నించి పుట్టిన
సరికొత్త ఆయుధాల్నీ యుద్ధాల్నీ చూస్తున్నాం.
సరిహద్దులూ యుద్ధాలూ
ఆయుధాలూ లేని ప్రపంచం కోసం కలలు కంటాను.

ఎప్పటికయినా సరే చూస్తుండండి
ప్రపంచంలో పక్షులన్నిటినీ ఏకం చేసి
సరిహద్దున్నిటినీ చెరిపేస్తాను.
కాశ్మీర్‌ అయితేనేం కాందహార్‌ అయితేనేం
పిల్లలందర్నీ కూడదీసి
కొత్త ప్రేమ ప్రపంచం స్థాపిస్తాను.

రచన : ఆకెళ్ళ రవిప్రకాష్
' ప్రేమ ప్రతిపాదన ' కవితా సంపుటి నుంచి

నా కవిత్వ నేపథ్యం

అతి చిన్న వయసునుంచి తెలుగు పాఠాల్ని అతిశ్రద్ధగా చదివేవాడ్ని. తెలుగు క్లాసుల్లో అత్యంత శ్రద్ధ కనపరిచేవాడ్ని. ముఖ్యంగా పద్యాలు వాటి ఛందస్సులతోపాటు అర్థంచేసుకునేవాడ్ని. చందమామలో కథలు చదివి మనసులో అలాటి కథలు రచించుకునేవాడ్ని. ఏ పత్రికలోనయినా ముందుగా కవిత్వం చదివేవాడ్ని. అర్ధం అయినా కాకపోయినా కవిత్వాన్ని పలుమార్లు మననం చేసుకునేవాడ్ని. ఈ రకంగా అతిసిన్న వయసునించి తెలుగుభాష మీద ముఖ్యంగా కవిత్వం మీద నాకు అత్యంత యిష్టం ఏర్పడింది. పది ఏళ్ళవయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం జరిగింది. ఆ తర్వాత తిలక్ అమృతం కురిసిన రాత్రి. అది చదివాకా నాకు ప్రపంచమే ఒక అద్భుతస్వప్నం లాగా, తెలుగుభాష, పదాలు, అక్షరాలు మరింత సుకుమారంగా అన్పించడం మొదలెట్టాయి. తిలక్ కవిత్వం చదివాక కవిత్వబీజం నాలో తెలీకుండానే పాతుకునిపోయింది. కవిత్వం రాయడం చాలా తర్వాత జరిగినా, కవిత్వానుభూతి ప్రతి విషయంలో చూడటం, నాదైన దృక్పథంలో అభిప్రాయాలు ఏర్పరచుకోడం అపుడే మొదలైంది.
స్నేహితులూ ..కవిత్వం 
ఇంజనీరింగులో చేరాక మొదటిసారి ఇంటినుంచి దూరంగా హాస్టల్లో వుండటంతో ఒక ఒంటరితనం, ఒక స్వతంత్రత వచ్చింది. అక్కడే రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న రవూఫ్ తో పరిచయం అయింది. రవూఫ్ అప్పటికే పేరున్న యువకవి. అంతర్నేత్రం కవితా సంకలనంతో ప్రముఖ కవిగా పేరు తెచ్చుకున్నాడు. అతని ద్వారా తెలుగు వచన కవిత్వం యొక్క తీరుతెన్నులన్నీ సమగ్రంగా అవగాహన చేసుకోగలిగే అవకాశం లభించింది. శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వ ప్రయాణాన్ని పూర్తిగా గమనించిందీ, ఆ సమయంలోనే.
ఇంజనీరింగు కాకినాడలో చదవడం ఇంకో పరిణామానికి దారితీసింది. ఇస్మాయిల్ గారితో పరిచయం. ఇస్మాయిల్ గారిని నాకు పరిచయం చేసింది రవూఫ్. రవూఫ్ అంతర్నేత్రం సంకలనానికి ఇస్మాయిల్ గారు ముందుమాట రాసి ఉన్నారు. అప్పటికే ఇస్మాయిల్ తెలుగు సాహిత్యంలో పేరుమోసిన కవి. అనుభూతి కవిత్వం పేరిట తనదైన ముద్ర కలిగిన కవి. ఆయన కవిత్వం అత్యంత స్పష్టంగా, అనుభూతి ప్రదానంగా వుండేది. ఆయన కవిత్వాన్ని చదవడం, ఆయన్ని కలుసుకోడం వ్యక్తినీ కవిత్వాన్నీ రెంటినీ అంచనా వేయడం జరిగేది. ఆయన జీవితానికీ, కవిత్వానికీ వున్న ఆత్మీయత అబ్బురపరచేది. నాకూ ఆయనకీ వయసులో దాదాపు 40 ఏళ్ళ వ్యత్యాసం వున్నా ఆయనలో వున్న సదాబాలకుడు నాతో చెలిమి చేసేవాడు. ఇద్దరం ఎన్నోసార్లు నడుచుకుంటూ భానుగుడి సెంటరులో టీ తాగడానికి వెళ్ళే వాళ్ళం. రవూఫ్, నేనూ వారాంత సెలవుల్లో అనేక కవిత్వ చర్చలు చేసేవాళ్ళం. ఇస్మాయిల్ గారు ప్రపంచ కవుల కవిత్వాన్ని రవూఫ్ కి నాకూ ఇచ్చి చదివించేవారు. రాయలేకుండా వుంటేగానీ రాయద్దని సలహా ఇచ్చేవారు. ఆయన్ని కలవడానికి వచ్చే ఆయన సాహితీ మిత్రుల్నీ, ప్రముఖ కవులనీ మాకు పరిచయం చేసేవారు. ఈ సమయంలో ఇస్మాయిల్ గారు శిఖామణి ’మువ్వల చేతికర్ర’ కి ముందుమాట రాసారు. శిఖామణి తరచుగా ఇస్మాయిల్ దగ్గరికి రావడంతో నేనూ రవూఫ్ శిఖామణిని అనేకసార్లు కలవడం తటస్థించింది. ’మువ్వల చేతికర్ర’ అప్పుడే కవిత్వం రాయడం మొదలెట్టిన నన్ను అత్యత్భుతంగా ప్రభావితం చేసింది. అతని కవిత్వంలో వున్న క్లిష్టతలేని గాఢత, రమ్యమైన కవితాశైలి నన్నెంతో ప్రభావితం చేశాయి. శలవలకి ఇంటికి వెళ్ళినపుడు విజయవాడలో పనిచేస్తున్న అఫ్సర్ తో పరిచయం. అఫ్సర్ తో స్నేహం నాలోని కవిత్వ దృక్పథాన్ని బలీయం చేసింది. అతని ’రక్తస్పర్శ’ చదివాక కవిత్వం రాయాలని కోరిక బలీయమైంది. ఆ సమయంలోనే నా మొదటి కవిత అచ్చయింది. తెలుగు కవిత్వ వాతావరణం అపుడు చాలా వాడిగా వేడిగా వుండేది. సోవియట్ యూనియన్ విడిపోయి ప్రపంచ పటంలో గీతలన్నీ చెరిగిపోయిన సంధర్భం. బెర్లిన్ గోడని కూల్చి ఒకవేపు కూలిపోతున్న సరిహద్దులు ఇంకోవేపు చెరిగిన గీతల స్థానంలో కొత్తగీతలు. తెలుగు కవిత్వం కూడా ఆతివేగంగా మారుతున్న వాదాలు. స్త్రీవాదం దళితవాదం యిలా అనేక నూతన ధోరణులు వుప్పెనలా సాహిత్యాన్ని ముంచెత్తిన కాలం.
అఫ్సర్ నేనూ స్నేహితులు అని చెప్పడం కన్నా ఆత్మబంధువులని చెప్పుకోడం సబబు. విజయవాడలో నలుమూలల్లో వున్న టీ స్టాళ్ళలో కూర్చుని పుస్తకాల గురించి, కవిత్వం గురించీ చర్చించుకునేవాళ్ళం. అఫ్సర్ ది అత్యద్భుత విలక్షణ వ్యక్తిత్వం. చాలా సరదాగా, లోతైన ఆలోచనా సరళితో గొప్ప కాల్పనిక సృజనాత్మక ధోరణితో అత్యంత స్నేహార్ధ్ర స్వభావంతో ఆ సమయంలో తెలుగు కవిత్వం ఆకాశంలోకి, అతివేగంగా దూసుకుపోతున్న తారాజువ్వ అతను. అతని సాంగత్యం, స్నేహం, చర్చలూ, కవిత్వ దృక్పథం నాలో కవిత్వ రచనని బాగా ప్రభావితం చేసింది. ఆ సమయంలోనే ప్రముఖ కవులు, అజంతా, నగ్నముని శివారెడ్డి, మో లతో పరిచయం ఏర్పడింది. అలాగే అఫ్సర్ స్నేహం ద్వారా ఏరా అని ఇప్పటికీ పిల్చుకునే నా తరం కవిప్రముఖులు సీతారాం, ప్రసేన్, యాకూబ్, వంశీకృష్ణ, గుడిపాటి, రమణమూర్తి, ఇక్బాల్ చంద్ లతో అత్యంత సన్నిహిత సంబంధాలు స్థిరపడ్డాయి. ఆ రోజుల్లో ఖాళీ సీసాల స్మయిల్ విజయవాడలో కమర్షియల్ టాక్సు ఆఫీసరుగా పనిచేసేవారు. యువ కవులందరినీ తన దగ్గరికి పిలిచి కవిత్వ పఠనం చేయించేవారు. ఆయన ఇల్లు ఎప్పుడూ కవిత్వ వాతావరణంతో కళకళలాడేది. ఆయన జీవన వ్యాపారాలలో కూరుకునిపోయి సాహిత్య సృజన జేయలేకపోయినా, కవిత్వం అన్నా, కవులన్నా ’స్మయిల్’ చూపించే ఆప్యాయత, కవిత్వం కోసం ప్రాణాలయినా పెట్టే మనస్తత్వం చూసి ఆశ్చర్యం వేసేది. తెలుగు భాష ఇలాంటి అద్భుత వ్యక్తుల సేవతో కలకాలం బతుకుతుందన్న నమ్మకం కలిగేది.
1991 లో నేను సివిల్ సర్వీసు పరీక్షకి చదువుకోడానికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ద్వారకా హోటల్లో సాయంత్రాలలో శలవుదినాలలో శివారెడ్డి గారి కవిత్వమిత్రుల కలయికలో నేనూ కలుస్తుండేవాడ్ని. వయసులోగానీ, కవిత్వానుభవములోగానీ అక్కడున్న అందరికన్నా నేను అతి చిన్న. అప్పుడప్పుడే అచ్చవుతున్న కవితలు, ఉద్యోగం కోసం, జీవితంలో స్థిరత కోసం యుద్ధం చేస్తున్న దశ. బంధువులు, తోటి శ్రేయోభిలాషులూ అందరూ నేను సివిల్ సర్వీసుకు తయారుకావడం కన్నా ఏదైనా దొరికిన వుద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత పెద్ద వుద్యోగంకోసం ప్రయత్నించుకోవచ్చు కదా అన్న అభిప్రాయం చెప్పేవారు. ఇంకొందరు స్నేహితులు నాతో ఇంజనీరింగు చదివినవారు తమతోపాటు అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించమని చెప్పేవారు. ఆర్ధికంగా గానీ, కుటుంబపరంగా గానీ అటు ఇటు ఆరేడు తరాలలో ఎవరూ గెజిటెడ్ హోదాలో పనిచేసినవారు లేకపోవడం, నేను సివిల్ సర్వీసు పరీక్షకి చదవడం అదీ వేరే వుద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయకుండా చదవడంతో నామీద అన్ని రకాల వత్తిడి తీవ్రంగా వుండేది. సివిల్ సర్వీసు సాధించడం కష్టతరమైనది కావడంతో ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళడం అనేది సినిమా టికెట్ కొనడం అంత సునాయసంగా జరిగేది. అమెరికా వెళ్ళకుండా యిక్కడే వుండడానికి ప్రభుత్వ వుద్యోగాలు తప్ప ఎక్కువ అవకాశాలు వుండేవి కావు. ఈ దేశంలో ఉన్నత విద్య అభ్యసించి, మూకుమ్మడిగా తరలిపోతున్న నాతరం ఇంజనీర్ల వలసనీ, ఇక్కడ వుద్యోగం రాక సంవత్సరాలు ఖాళీగా వున్న ఇంజనీర్లు. విసిగి వేసారి అమెరికా వెళ్ళి అక్కడ విజయశిఖరాలు ఎక్కడం కూడా కళ్ళారా చూసి మనదేశం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందా అని బాధపడేవాడ్ని.
ఈ రకమైన సందర్భంలో విన్నకోట రవిశంకర్, యాకూబ్ శిఖామణి తరచుగా నన్ను కలిసేవారు. స్త్రీవాదం క్రమ క్రమంగా తెలుగు కవిత్వంలో ప్రాధాన్యం సంతరించుకున్న క్రమం చాలా దగ్గరగా చూశాను ఆ సమయంలో, ఒక యుద్ద వాతావరణ క్రమంలా వుండేవి స్త్రీవాద సభలు. తెలుగు కవిత్వాన్ని వుప్పెనలా చుట్టుముట్టిన ఆ సందర్భంలో స్త్రీవాద కవయిత్రులను చూడడం, కవిత్వాలు వినడం అత్యద్భుత అనుభవం. కవిగా అపుడపుడే నడవడం నేర్చుకుంటున్న ఏ కవికైనా ఇంత పుష్కలంగా కవిత్వ జలపాతాలలో రోజూ స్నానం చేయడం గొప్ప అవకాశం. ఆ సమయంలోనే ముఖ్యంగా అఫ్సర్ ప్రోద్బలంతో నా మొదటి కవితాసంపుటి “ఓ కొత్త మొహంజోదారో” ప్రచురించడం జరిగింది. అప్పుడే చేరామాష్టారు ’చేరాతల్లో’ నా పుస్తకం గురించి రాసి తెలుగు కవిత్వంలోకి నా రాకని నిర్ద్వందంగా ప్రకటించారు. చేరామాష్టారు ఆ సమీక్షలో అత్యంత అప్యాయంగా నన్ను తెలుగు కవిత్వంలోకి ఆహ్వానించారు కూడా
పాండిచ్చేరి నగరంతో చెలిమి
1994 లో సివిల్ సర్వీసు పరీక్ష పాసయ్యి పాండిచ్చేరి సివిల్ సర్వీసులో చేరడం నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు. నా కవిత్వంలో కూడా అది అత్యంత బలమైన మైలురాయిగా మిగిలింది. ఉద్యోగంలో చేరడానికి మొదటిసారి పాండిచ్చేరికి వచ్చిన నేను సముద్రానికి అంత దగ్గరగా ఒక నగరం ఉంటుందని ఎన్నడూ కల గూడా కనలేదు. సముద్రం ఒడిలో ఆటలాడుతున్న ఇంత అందమైన నగరం యీ భూప్రపంచం మీద ఒకటుంటుందని ఊహించలేదు. పాండిచ్చేరిలో ఉద్యోగంలో చేరిన ఒక నెల రోజులపాటు నేను ప్రతి సాయంత్రం సముద్రపు సాంగత్యంలో గడిపాను. కొన్ని రోజులు సాయంత్రం మొదలుకొని ఉదయపు సూర్యుని రాక వరకు సముద్రం యెక్క వివిధ భంగిమల్ని సముద్రం-నగరం యెక్క చెలిమిని, రాత్రీపగళ్ళ పయనాల్ని చూసి పలవరించేవాడ్ని. పాండిచ్చేరి నగరం ఫ్రెంచివారి వలస రాజధాని. ఇక్కడ్నించీ ఫ్రెంచివారు భారతదేశంలో అనేక భూభాగాల్ని పాలించి చివరికి బ్రిటీషువారితో ఓడిపోయి యీ ఒక్క నగరాన్ని మరికొన్ని ప్రాంతాల్ని మటుకు 1964 వరకు కూడా పాలించారు. ఒకవేళ ఫ్రెంచివారు కొన్ని అతిముఖ్య యుద్ధాలు ఓడిపోకపోయిఉంటే భారత రాజధాని డిల్లీ బదులు పాండిచ్చేరి అయి ఉండేది. ఇది అందుకే చారిత్రక ప్రాధాన్యత గలిగిన నగరం. భారత స్వాతంత్ర్య పోరాటంలో తనదైన స్థానం గలిగిన అరబిందోఘోష్ సర్వస్వాన్ని పరిత్యజించి ఇక్కడే తపస్సు చేసుకున్నాడు. తమిళుల యెక్క కవితాకీర్తిశిఖరం సుబ్రహ్మణ్య భారతి పాండిచ్చేరిలోనే తన కవిత్వ ప్రయాణం సాగించాడు. పాండిచ్చేరికి తనదైన అందమే కాక చారిత్రకంగా, తాత్వికంగా, సాహిత్యపరంగా తనదైన స్థానం వుంది. అసలు ఎందుకు యీ తూర్పుతీరంలో యిన్ని గ్రామాలు ఉండగా పుదుచ్చేరి అనే చిన్న గ్రామాన్ని ఫ్రెంచివారు తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు? ఈ నగరం వాళ్ళకి ఏదో తెలీని ఒక అందంతో ఆనందంతో ముఖ్యంగా మనశ్శాంతితో ఇంకెక్కడ దొరకని పరిపూర్ణతతో నింపి ఉంటుంది. ఇలాటి నగరంలో నేను అడుగుపెట్టిన మొదటిరోజునించీ కూడా సముద్రం నా కవిత్వంలో ఒక ముఖ్య వస్తువు కింద ప్రాముఖ్యత సంతరించుకుంది.
యానం యిచ్చిన ఈనాం
1998 నాకు యానాం అడ్మినిస్ట్రేటరు/సబ్ కలెక్టర్ గా బదిలీ అయింది. నేను తెలుగు వాడ్ని కావటం యానాం కాకినాడకి అతి చేరువలో వుండటం ఆనందం కలిగించిన విషయం. ఫ్రెంచివారి హయాంలో పరిపాలించ బడిన యానాం, పాండిచ్చేరికి 800 కి.మీ. దూరంలో ఉన్నా ఇంకా పాలనాపరంగా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక తాలూకా. కాకినాడలో నేను నాలుగేళ్ళు ఇంజనీరింగు చేసినపుడు అడపాదడపా స్నేహితులు యానాం వెళ్ళి తక్కువ ధరకి లభించే ఫ్రెంచి మద్యాన్ని రుచిచూసి రావడం జరిగేది.
యానాంలో గోదావరి ఒడ్డున ఫ్రెంచి దొరలు నివసించిన రాజప్రసాదం నా ఆఫీసు. ఆఫీసు వెనకాల ఇల్లు. యానాంలో నేను పనిచేసిన రెండేళ్ళూ కవిత్వపరంగా కీలకమైన దశ. ఒకపక్క పని వత్తిడి, పరిపాలనాపరంగా రాజధానికి 800 కి.మీ. దూరంలో వుండటం వలన అన్ని సమస్యలూ ఎంతో ఓపికతో పరిష్కరించాల్సి వచ్చేది. ఈ మధ్యలో అడపాదడపా వచ్చిపోయే ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించే కాలంలో ఆఫీసుకి వెనకాలే యిల్లు వున్నాసరే మా శ్రీమతితో అసలు మాట్లాడకుండా కూడా కొన్ని రోజులు గడిచిపోయేవి. తను ఉదయం లేచే ముందే ఆఫీసుకో, బయటికో వెళ్ళి, తను నిద్రపోయిన తర్వాత ఎపుడో నేను ఇంటికి చేరడం జరిగేది. ఈ రకమైన కాలంలో నన్ను కవిగా బతికించింది దాట్ల దేవదానం రాజు స్నేహం. నేనెంత వత్తిడిలో వున్నా ప్రతి సాయంత్రం దేవదానం రాజుగారు నేను తప్పక కలిసేవాళ్ళం. వస్తున్న సాహిత్య ధోరణుల్ని ప్రస్తావించేవారు. ఆయన ఆత్మీయత, ఆయన స్నేహంలో వున్న స్వచ్ఛత, నిర్మలత దాంతో ముడివడివున్న సాహితీ చర్చలు ఎంత వత్తిడినైనా నేను వెంటనే మర్చిపోయేలా చేసేవి. వయసులో నాకన్నా సుమారు ఇరవై ఏళ్ళు పెద్ద అయిన దాట్ల దేవదానం రాజుగారు నాకు స్నేహితుడు, తాత్వికుడూ, దార్శనికుడుగా వ్యవహరించేవారు. ఈ స్నేహం ద్వారా అత్యధికంగా లాభపడింది నా కవిత్వం.
యానాం ద్వారా నాకు చేకూరిన మరొక వరం ఇస్మాయిల్ సాంగత్యం. ఇస్మాయిల్ గారు పుట్టి పెరిగింది యానాం పక్కన ఇంజారం గ్రామం. అందుకే యానాం రావడం ఇస్మాయిల్ గారికి అత్యంత వుత్సాహంగా వుండేది. యానాంకి పాతిక కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ వుండటం వలన ఇస్మాయిల్ గారిని నేను తరచు కలవడం, ఆయనకి యిష్టమైతే యానాం తీసుకు రావడం జరిగేది. గోదావరితీరం, పుట్టినవూరిలాంటి వాతావరణం. ఒకసారి యానాం వస్తే ఇస్మాయిల్ గారు రెండుమూడు రోజులైనా వుండేవారు. పైగా ఆ ప్రాంతపు అధికారిగా నా ఆతిధ్యం వలన ఆయనకి రాజమర్యాదలు జరిగేవి. ఇస్మాయిల్ గారు ఆయన మిత్ర ప్రముఖుల్ని కూడా తోడ్కొని యానాం వచ్చేవారు. త్రిపుర, సదాశివరావు, వగైరా మిత్రులతో యానాంలో సాహిత్యవాతావరణం వెల్లి విరిసేది. ఏదైనా పని ఒత్తిడిలో వారికూడా నేను వుండలేకపోతే దాట్ల దేవదానం రాజుగారు నేను లేని లోటు తెలవకుండా చూసేవారు. రెండేళ్ళపాటు యీ రకమైన సాంగత్యం నిరాటంకంగా సాగింది. ఈ రకమైన సంధర్భంలో నేను యానాం నుంచి బదిలీ కావడం జరిగింది. చాలా అకస్మాత్తుగా పాండిచ్ఛేరికి బదిలీ కావడం, ఆ సమయంలో మా అబ్బాయి పుట్టడం వలన కాకినాడ ఆసుపత్రిలో మా శ్రీమతి చేరి వుండటం అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులకి గురిచేశాయి. ’ఇసకగుడి’ కవితా సంకలనం యీరకమైన నేపథ్యంలో బయటికొచ్చింది. ఈ సంకలనం రావడానికి దాట్ల దేవదానం రాజుగారి పట్టుదల కారణం. ఆయన పట్టుపట్టకపోయివుంటే ఆ సమయంలో ఆ కవితా సంకలనం వచ్చివుండేది కాదు. ’ఇసుకగుడి’ మీద వచ్చిన సమీక్షలు, నా కవిత్వ యాత్రలో గొప్ప మలుపుగా నిలిచాయి. నాదంటూ ఒక పాఠకలుని, యీరకమైన కవిత్వానికి తనదైన స్థానాన్ని ’ఇసుకగుడి’ సమకూర్చింది. ’ఇసుకగుడి’ తీసుకురాడానికి మూలస్తంభాలుగా నిలిచిన ఇస్మాయిల్ గారికి, దాట్ల దేవదానం రాజుగారికి సదా ఋణపడి ఉంటాను.
మళ్ళీ పాండిచ్చేరికి
యానాం నించి పాండిచ్చేరికి నా తిరుగు ప్రయాణం సజావుగా సాగలేదు. కాకినాడలో మా శ్రీమతి, అప్పుడే పుట్టిన మా అబ్బాయి యిద్దరూ ఆరోగ్యకారణాల రీత్యా ఆసుపత్రిలో వుండటంతో కాకినాడలో ఒక యిల్లు తీసుకుని నెలరోజులు వుండాల్సి వచ్చింది. అక్కడ్నించి విజయవాడలో మజిలీ చేసినపుడు మా నాన్నగారు అర్థాంతరంగా మరణించడం వలన అక్కడ రెండునెలలు వుండాల్సి వచ్చింది. ఈ అనుకోని మజిలీల వలన నేనూ నా కుటుంబం, అనేక అవస్థల్ని తట్టుకోవాల్సి వచ్చింది. ఈ రకంగా నా కుటుంబం సామానుతో పాటు వయా కాకినాడ, విజయవాడ నెలల పాటు మజిలీలు చేసి ఆఖరుకి పాండిచ్చేరి చేరడం జరిగింది.

నా చిన్నతనంలో మా నాన్నగారు ఇరిగేషన్ శాఖలో సూపర్ వైజరుగా పనిచేసినపుడు ప్రతి సంవత్సరం ఒక కొత్త వూరికి బదిలీ అయేది. ప్రతి సంవత్సరం కొత్త స్కూలు కొత్త స్నేహితుల్ని కలవడం మళ్ళీ విడిపోడం బాగా అలవాటయిన నాకు కొత్త మజిలీలంటే ఆసక్తి ఉండేది. అయితే యానాం నుంచి పాండిచ్చేరికి బదిలీ యీ ఆసక్తిని చంపేసింది. నేనూ నా కుటుంబం నానా అవస్థలు పడి చివరికి పాండిచ్చేరి చేరాకా ఇక ఎన్నడూ పాండిచ్చేరి దాటి బదిలీ అనేదే వద్దురా బాబూ అన్నంతగా బదిలీల మీద విరక్తి కలిగింది. పాండిచ్చేరిలో యానాం కన్నా ఎక్కువ నాకు విరామం దొరకడం రాజధాని నగరం కావడంతో అన్నీ మనమే అన్న వత్తిడి కాకుండా, తక్కువ బాధ్యత దానికి తగిన విధంగా తక్కువ పనివత్తిడి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేది. అదేరకంగా సాయంత్రం ఆరయేసరికి యింటికి చేరి మా అబ్బాయితో షికారుకి వెళ్ళడం, కుటుంబపరమైన ప్రత్యేక సమయాలని అనందించడం మొదలైంది. రెండు సంవత్సరాల పాటు పాండిచ్చేరిలో ఉద్యోగం, కుటుంబపరమైన స్థిరత్వం, మా అబ్బాయితో ఆడుకున్న సాయంత్రాలు నా జీవితంలో అత్యంత సంపూర్ణత చేకూర్చిన సందర్భాలు. ఒక సుదూరమైన అన్యభాషా ప్రాంతానికి ఉద్యోగరీత్యా వలసవచ్చి, యీ ప్రాంతంలో ఒకడిగా స్థిరపడ్డ నాకు పాండిచ్చేరి నగరం అంటే అవ్యాజమైన అనురాగం ఏర్పడింది. నా జీవితంలో అత్యంత అందమైన అనుభవాలన్నీ యీ నగరంలో జరగడం, మనశ్శాంతి, ఆత్మశాంతిని చేకూర్చిన నగరం కావడం వలన నా కవిత్వంలో పాండిచ్చేరి నగరం ప్రముఖంగా ప్రస్తావించబడింది.
నేనెందుకు రాస్తున్నాను ?

వర్షబిందువు ఆకాశం నించి, రాలి ఎలా జలపాతమై ప్రవహిస్తుందో అలాగే నాలో కవిత్వం అంకురించి, జీవితానికి సమాంతరంగా ప్రవహిస్తోంది. వర్షబిందువుని నువ్వు ఎందుకు కురుస్తున్నావని అడిగితే ఏం చెబుతుంది? కురవడం నా సహజ తత్వం అని చెబుతుంది. వర్షించకుండా వుండలేనని చెబుతుంది. అలాగే కవిత్వం రాయడం నా సహజ తత్వం. రాయకుండా వుండలేను. కురవడం లేకుండా వర్షానికి అస్థిత్వం ఎలా లేదో, కవిత్వం లేకుండా నాకు అస్థిత్వం లేదు. కవిత్వం రాయకుండా జీవితాన్ని ఊహించుకోలేను.
- ఆకెళ్ళ రవిప్రకాష్