Wednesday, September 21, 2016

నువూ నేనూ కాలానికి తలో చివరా…






















12-ఏప్రిల్-2013

ఈ నాలుగు పదుల బాల్యం
ఇలాగే కరిగిపోతుంది.

ఉదయాలూ సాయంత్రాలూ
కాలం కొండని కరగదీస్తుంటాయి.

పాదముద్రలన్నీ తీరమ్మీద
మళ్ళీ సంతకాలు చేస్తూనే వుంటాయి.

ఇరానీ టీ కప్పుల్లోకి
నిరుద్యోగాన్ని వడపోసుకుంటూ
విఫల ప్రేమ కథల గురించి
తెల్లారే వరకు
నువు తడిమిన గాయాల చిరునామాలు
నా కళ్ల వెనక ఇంకా వేలాడుతూనే వున్నాయి.

ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో
ఎవరికి తెలుసు?
చెరిగిపోయిన స్వప్నాల్లోంచి
చెరగని గాయాల్లోంచీ
రాయని లేఖల్లోంచీ
మిగిలిన సెల్ఫోన్ కబుర్లలోంచీ
మనమంతా విడివిడిగా
ప్రపంచానికి తలో మూలకి.

నాలోపలి నీతో
మగతలోనో, మెలకువలోనో
మళ్ళీ సంభాషణ మొదలెడతాను
ఒక్కోసారి అసలు నేనెవరో
నువ్వెవరో గుర్తుపట్టలేనంతగా
నీలోకి కోల్పోతాను.

ఒక్కోసారి లోపలి సంభాషణలోంచి
సప్తసముద్రాలూ ఈది
నీ దగ్గిరకి నడిచి వస్తాను.

అసలు ఇలాగే
నీ అనుభవంలో
నిన్ను నువ్వు నాలోకి,
అందరిలోకీ
గుర్తుపట్టలేనంతగా
కోల్పోడం జరుగుతుందా?

ఈ ప్రశ్నకి సమాధానం
వెతుక్కుంటూ
నేను
భూగోళాన్నవుతాను.
నింగినవుతాను
కాలాన్నవుతాను

నువూ నేనూ
కాలానికి తలో చివరా
లంగరేసి
నాలుగు పదుల గాయాల్ని
కొత్తగా దర్శిస్తూ.


(అఫ్సర్ కీ … ఏప్రిల్ 11 కీ )
Painting: Mandira Bhaduri (University of Chicago)

No comments:

Post a Comment