Tuesday, September 20, 2016

నా కవిత్వ నేపథ్యం

అతి చిన్న వయసునుంచి తెలుగు పాఠాల్ని అతిశ్రద్ధగా చదివేవాడ్ని. తెలుగు క్లాసుల్లో అత్యంత శ్రద్ధ కనపరిచేవాడ్ని. ముఖ్యంగా పద్యాలు వాటి ఛందస్సులతోపాటు అర్థంచేసుకునేవాడ్ని. చందమామలో కథలు చదివి మనసులో అలాటి కథలు రచించుకునేవాడ్ని. ఏ పత్రికలోనయినా ముందుగా కవిత్వం చదివేవాడ్ని. అర్ధం అయినా కాకపోయినా కవిత్వాన్ని పలుమార్లు మననం చేసుకునేవాడ్ని. ఈ రకంగా అతిసిన్న వయసునించి తెలుగుభాష మీద ముఖ్యంగా కవిత్వం మీద నాకు అత్యంత యిష్టం ఏర్పడింది. పది ఏళ్ళవయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం జరిగింది. ఆ తర్వాత తిలక్ అమృతం కురిసిన రాత్రి. అది చదివాకా నాకు ప్రపంచమే ఒక అద్భుతస్వప్నం లాగా, తెలుగుభాష, పదాలు, అక్షరాలు మరింత సుకుమారంగా అన్పించడం మొదలెట్టాయి. తిలక్ కవిత్వం చదివాక కవిత్వబీజం నాలో తెలీకుండానే పాతుకునిపోయింది. కవిత్వం రాయడం చాలా తర్వాత జరిగినా, కవిత్వానుభూతి ప్రతి విషయంలో చూడటం, నాదైన దృక్పథంలో అభిప్రాయాలు ఏర్పరచుకోడం అపుడే మొదలైంది.
స్నేహితులూ ..కవిత్వం 
ఇంజనీరింగులో చేరాక మొదటిసారి ఇంటినుంచి దూరంగా హాస్టల్లో వుండటంతో ఒక ఒంటరితనం, ఒక స్వతంత్రత వచ్చింది. అక్కడే రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న రవూఫ్ తో పరిచయం అయింది. రవూఫ్ అప్పటికే పేరున్న యువకవి. అంతర్నేత్రం కవితా సంకలనంతో ప్రముఖ కవిగా పేరు తెచ్చుకున్నాడు. అతని ద్వారా తెలుగు వచన కవిత్వం యొక్క తీరుతెన్నులన్నీ సమగ్రంగా అవగాహన చేసుకోగలిగే అవకాశం లభించింది. శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వ ప్రయాణాన్ని పూర్తిగా గమనించిందీ, ఆ సమయంలోనే.
ఇంజనీరింగు కాకినాడలో చదవడం ఇంకో పరిణామానికి దారితీసింది. ఇస్మాయిల్ గారితో పరిచయం. ఇస్మాయిల్ గారిని నాకు పరిచయం చేసింది రవూఫ్. రవూఫ్ అంతర్నేత్రం సంకలనానికి ఇస్మాయిల్ గారు ముందుమాట రాసి ఉన్నారు. అప్పటికే ఇస్మాయిల్ తెలుగు సాహిత్యంలో పేరుమోసిన కవి. అనుభూతి కవిత్వం పేరిట తనదైన ముద్ర కలిగిన కవి. ఆయన కవిత్వం అత్యంత స్పష్టంగా, అనుభూతి ప్రదానంగా వుండేది. ఆయన కవిత్వాన్ని చదవడం, ఆయన్ని కలుసుకోడం వ్యక్తినీ కవిత్వాన్నీ రెంటినీ అంచనా వేయడం జరిగేది. ఆయన జీవితానికీ, కవిత్వానికీ వున్న ఆత్మీయత అబ్బురపరచేది. నాకూ ఆయనకీ వయసులో దాదాపు 40 ఏళ్ళ వ్యత్యాసం వున్నా ఆయనలో వున్న సదాబాలకుడు నాతో చెలిమి చేసేవాడు. ఇద్దరం ఎన్నోసార్లు నడుచుకుంటూ భానుగుడి సెంటరులో టీ తాగడానికి వెళ్ళే వాళ్ళం. రవూఫ్, నేనూ వారాంత సెలవుల్లో అనేక కవిత్వ చర్చలు చేసేవాళ్ళం. ఇస్మాయిల్ గారు ప్రపంచ కవుల కవిత్వాన్ని రవూఫ్ కి నాకూ ఇచ్చి చదివించేవారు. రాయలేకుండా వుంటేగానీ రాయద్దని సలహా ఇచ్చేవారు. ఆయన్ని కలవడానికి వచ్చే ఆయన సాహితీ మిత్రుల్నీ, ప్రముఖ కవులనీ మాకు పరిచయం చేసేవారు. ఈ సమయంలో ఇస్మాయిల్ గారు శిఖామణి ’మువ్వల చేతికర్ర’ కి ముందుమాట రాసారు. శిఖామణి తరచుగా ఇస్మాయిల్ దగ్గరికి రావడంతో నేనూ రవూఫ్ శిఖామణిని అనేకసార్లు కలవడం తటస్థించింది. ’మువ్వల చేతికర్ర’ అప్పుడే కవిత్వం రాయడం మొదలెట్టిన నన్ను అత్యత్భుతంగా ప్రభావితం చేసింది. అతని కవిత్వంలో వున్న క్లిష్టతలేని గాఢత, రమ్యమైన కవితాశైలి నన్నెంతో ప్రభావితం చేశాయి. శలవలకి ఇంటికి వెళ్ళినపుడు విజయవాడలో పనిచేస్తున్న అఫ్సర్ తో పరిచయం. అఫ్సర్ తో స్నేహం నాలోని కవిత్వ దృక్పథాన్ని బలీయం చేసింది. అతని ’రక్తస్పర్శ’ చదివాక కవిత్వం రాయాలని కోరిక బలీయమైంది. ఆ సమయంలోనే నా మొదటి కవిత అచ్చయింది. తెలుగు కవిత్వ వాతావరణం అపుడు చాలా వాడిగా వేడిగా వుండేది. సోవియట్ యూనియన్ విడిపోయి ప్రపంచ పటంలో గీతలన్నీ చెరిగిపోయిన సంధర్భం. బెర్లిన్ గోడని కూల్చి ఒకవేపు కూలిపోతున్న సరిహద్దులు ఇంకోవేపు చెరిగిన గీతల స్థానంలో కొత్తగీతలు. తెలుగు కవిత్వం కూడా ఆతివేగంగా మారుతున్న వాదాలు. స్త్రీవాదం దళితవాదం యిలా అనేక నూతన ధోరణులు వుప్పెనలా సాహిత్యాన్ని ముంచెత్తిన కాలం.
అఫ్సర్ నేనూ స్నేహితులు అని చెప్పడం కన్నా ఆత్మబంధువులని చెప్పుకోడం సబబు. విజయవాడలో నలుమూలల్లో వున్న టీ స్టాళ్ళలో కూర్చుని పుస్తకాల గురించి, కవిత్వం గురించీ చర్చించుకునేవాళ్ళం. అఫ్సర్ ది అత్యద్భుత విలక్షణ వ్యక్తిత్వం. చాలా సరదాగా, లోతైన ఆలోచనా సరళితో గొప్ప కాల్పనిక సృజనాత్మక ధోరణితో అత్యంత స్నేహార్ధ్ర స్వభావంతో ఆ సమయంలో తెలుగు కవిత్వం ఆకాశంలోకి, అతివేగంగా దూసుకుపోతున్న తారాజువ్వ అతను. అతని సాంగత్యం, స్నేహం, చర్చలూ, కవిత్వ దృక్పథం నాలో కవిత్వ రచనని బాగా ప్రభావితం చేసింది. ఆ సమయంలోనే ప్రముఖ కవులు, అజంతా, నగ్నముని శివారెడ్డి, మో లతో పరిచయం ఏర్పడింది. అలాగే అఫ్సర్ స్నేహం ద్వారా ఏరా అని ఇప్పటికీ పిల్చుకునే నా తరం కవిప్రముఖులు సీతారాం, ప్రసేన్, యాకూబ్, వంశీకృష్ణ, గుడిపాటి, రమణమూర్తి, ఇక్బాల్ చంద్ లతో అత్యంత సన్నిహిత సంబంధాలు స్థిరపడ్డాయి. ఆ రోజుల్లో ఖాళీ సీసాల స్మయిల్ విజయవాడలో కమర్షియల్ టాక్సు ఆఫీసరుగా పనిచేసేవారు. యువ కవులందరినీ తన దగ్గరికి పిలిచి కవిత్వ పఠనం చేయించేవారు. ఆయన ఇల్లు ఎప్పుడూ కవిత్వ వాతావరణంతో కళకళలాడేది. ఆయన జీవన వ్యాపారాలలో కూరుకునిపోయి సాహిత్య సృజన జేయలేకపోయినా, కవిత్వం అన్నా, కవులన్నా ’స్మయిల్’ చూపించే ఆప్యాయత, కవిత్వం కోసం ప్రాణాలయినా పెట్టే మనస్తత్వం చూసి ఆశ్చర్యం వేసేది. తెలుగు భాష ఇలాంటి అద్భుత వ్యక్తుల సేవతో కలకాలం బతుకుతుందన్న నమ్మకం కలిగేది.
1991 లో నేను సివిల్ సర్వీసు పరీక్షకి చదువుకోడానికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ద్వారకా హోటల్లో సాయంత్రాలలో శలవుదినాలలో శివారెడ్డి గారి కవిత్వమిత్రుల కలయికలో నేనూ కలుస్తుండేవాడ్ని. వయసులోగానీ, కవిత్వానుభవములోగానీ అక్కడున్న అందరికన్నా నేను అతి చిన్న. అప్పుడప్పుడే అచ్చవుతున్న కవితలు, ఉద్యోగం కోసం, జీవితంలో స్థిరత కోసం యుద్ధం చేస్తున్న దశ. బంధువులు, తోటి శ్రేయోభిలాషులూ అందరూ నేను సివిల్ సర్వీసుకు తయారుకావడం కన్నా ఏదైనా దొరికిన వుద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత పెద్ద వుద్యోగంకోసం ప్రయత్నించుకోవచ్చు కదా అన్న అభిప్రాయం చెప్పేవారు. ఇంకొందరు స్నేహితులు నాతో ఇంజనీరింగు చదివినవారు తమతోపాటు అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించమని చెప్పేవారు. ఆర్ధికంగా గానీ, కుటుంబపరంగా గానీ అటు ఇటు ఆరేడు తరాలలో ఎవరూ గెజిటెడ్ హోదాలో పనిచేసినవారు లేకపోవడం, నేను సివిల్ సర్వీసు పరీక్షకి చదవడం అదీ వేరే వుద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయకుండా చదవడంతో నామీద అన్ని రకాల వత్తిడి తీవ్రంగా వుండేది. సివిల్ సర్వీసు సాధించడం కష్టతరమైనది కావడంతో ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళడం అనేది సినిమా టికెట్ కొనడం అంత సునాయసంగా జరిగేది. అమెరికా వెళ్ళకుండా యిక్కడే వుండడానికి ప్రభుత్వ వుద్యోగాలు తప్ప ఎక్కువ అవకాశాలు వుండేవి కావు. ఈ దేశంలో ఉన్నత విద్య అభ్యసించి, మూకుమ్మడిగా తరలిపోతున్న నాతరం ఇంజనీర్ల వలసనీ, ఇక్కడ వుద్యోగం రాక సంవత్సరాలు ఖాళీగా వున్న ఇంజనీర్లు. విసిగి వేసారి అమెరికా వెళ్ళి అక్కడ విజయశిఖరాలు ఎక్కడం కూడా కళ్ళారా చూసి మనదేశం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందా అని బాధపడేవాడ్ని.
ఈ రకమైన సందర్భంలో విన్నకోట రవిశంకర్, యాకూబ్ శిఖామణి తరచుగా నన్ను కలిసేవారు. స్త్రీవాదం క్రమ క్రమంగా తెలుగు కవిత్వంలో ప్రాధాన్యం సంతరించుకున్న క్రమం చాలా దగ్గరగా చూశాను ఆ సమయంలో, ఒక యుద్ద వాతావరణ క్రమంలా వుండేవి స్త్రీవాద సభలు. తెలుగు కవిత్వాన్ని వుప్పెనలా చుట్టుముట్టిన ఆ సందర్భంలో స్త్రీవాద కవయిత్రులను చూడడం, కవిత్వాలు వినడం అత్యద్భుత అనుభవం. కవిగా అపుడపుడే నడవడం నేర్చుకుంటున్న ఏ కవికైనా ఇంత పుష్కలంగా కవిత్వ జలపాతాలలో రోజూ స్నానం చేయడం గొప్ప అవకాశం. ఆ సమయంలోనే ముఖ్యంగా అఫ్సర్ ప్రోద్బలంతో నా మొదటి కవితాసంపుటి “ఓ కొత్త మొహంజోదారో” ప్రచురించడం జరిగింది. అప్పుడే చేరామాష్టారు ’చేరాతల్లో’ నా పుస్తకం గురించి రాసి తెలుగు కవిత్వంలోకి నా రాకని నిర్ద్వందంగా ప్రకటించారు. చేరామాష్టారు ఆ సమీక్షలో అత్యంత అప్యాయంగా నన్ను తెలుగు కవిత్వంలోకి ఆహ్వానించారు కూడా
పాండిచ్చేరి నగరంతో చెలిమి
1994 లో సివిల్ సర్వీసు పరీక్ష పాసయ్యి పాండిచ్చేరి సివిల్ సర్వీసులో చేరడం నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు. నా కవిత్వంలో కూడా అది అత్యంత బలమైన మైలురాయిగా మిగిలింది. ఉద్యోగంలో చేరడానికి మొదటిసారి పాండిచ్చేరికి వచ్చిన నేను సముద్రానికి అంత దగ్గరగా ఒక నగరం ఉంటుందని ఎన్నడూ కల గూడా కనలేదు. సముద్రం ఒడిలో ఆటలాడుతున్న ఇంత అందమైన నగరం యీ భూప్రపంచం మీద ఒకటుంటుందని ఊహించలేదు. పాండిచ్చేరిలో ఉద్యోగంలో చేరిన ఒక నెల రోజులపాటు నేను ప్రతి సాయంత్రం సముద్రపు సాంగత్యంలో గడిపాను. కొన్ని రోజులు సాయంత్రం మొదలుకొని ఉదయపు సూర్యుని రాక వరకు సముద్రం యెక్క వివిధ భంగిమల్ని సముద్రం-నగరం యెక్క చెలిమిని, రాత్రీపగళ్ళ పయనాల్ని చూసి పలవరించేవాడ్ని. పాండిచ్చేరి నగరం ఫ్రెంచివారి వలస రాజధాని. ఇక్కడ్నించీ ఫ్రెంచివారు భారతదేశంలో అనేక భూభాగాల్ని పాలించి చివరికి బ్రిటీషువారితో ఓడిపోయి యీ ఒక్క నగరాన్ని మరికొన్ని ప్రాంతాల్ని మటుకు 1964 వరకు కూడా పాలించారు. ఒకవేళ ఫ్రెంచివారు కొన్ని అతిముఖ్య యుద్ధాలు ఓడిపోకపోయిఉంటే భారత రాజధాని డిల్లీ బదులు పాండిచ్చేరి అయి ఉండేది. ఇది అందుకే చారిత్రక ప్రాధాన్యత గలిగిన నగరం. భారత స్వాతంత్ర్య పోరాటంలో తనదైన స్థానం గలిగిన అరబిందోఘోష్ సర్వస్వాన్ని పరిత్యజించి ఇక్కడే తపస్సు చేసుకున్నాడు. తమిళుల యెక్క కవితాకీర్తిశిఖరం సుబ్రహ్మణ్య భారతి పాండిచ్చేరిలోనే తన కవిత్వ ప్రయాణం సాగించాడు. పాండిచ్చేరికి తనదైన అందమే కాక చారిత్రకంగా, తాత్వికంగా, సాహిత్యపరంగా తనదైన స్థానం వుంది. అసలు ఎందుకు యీ తూర్పుతీరంలో యిన్ని గ్రామాలు ఉండగా పుదుచ్చేరి అనే చిన్న గ్రామాన్ని ఫ్రెంచివారు తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు? ఈ నగరం వాళ్ళకి ఏదో తెలీని ఒక అందంతో ఆనందంతో ముఖ్యంగా మనశ్శాంతితో ఇంకెక్కడ దొరకని పరిపూర్ణతతో నింపి ఉంటుంది. ఇలాటి నగరంలో నేను అడుగుపెట్టిన మొదటిరోజునించీ కూడా సముద్రం నా కవిత్వంలో ఒక ముఖ్య వస్తువు కింద ప్రాముఖ్యత సంతరించుకుంది.
యానం యిచ్చిన ఈనాం
1998 నాకు యానాం అడ్మినిస్ట్రేటరు/సబ్ కలెక్టర్ గా బదిలీ అయింది. నేను తెలుగు వాడ్ని కావటం యానాం కాకినాడకి అతి చేరువలో వుండటం ఆనందం కలిగించిన విషయం. ఫ్రెంచివారి హయాంలో పరిపాలించ బడిన యానాం, పాండిచ్చేరికి 800 కి.మీ. దూరంలో ఉన్నా ఇంకా పాలనాపరంగా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక తాలూకా. కాకినాడలో నేను నాలుగేళ్ళు ఇంజనీరింగు చేసినపుడు అడపాదడపా స్నేహితులు యానాం వెళ్ళి తక్కువ ధరకి లభించే ఫ్రెంచి మద్యాన్ని రుచిచూసి రావడం జరిగేది.
యానాంలో గోదావరి ఒడ్డున ఫ్రెంచి దొరలు నివసించిన రాజప్రసాదం నా ఆఫీసు. ఆఫీసు వెనకాల ఇల్లు. యానాంలో నేను పనిచేసిన రెండేళ్ళూ కవిత్వపరంగా కీలకమైన దశ. ఒకపక్క పని వత్తిడి, పరిపాలనాపరంగా రాజధానికి 800 కి.మీ. దూరంలో వుండటం వలన అన్ని సమస్యలూ ఎంతో ఓపికతో పరిష్కరించాల్సి వచ్చేది. ఈ మధ్యలో అడపాదడపా వచ్చిపోయే ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించే కాలంలో ఆఫీసుకి వెనకాలే యిల్లు వున్నాసరే మా శ్రీమతితో అసలు మాట్లాడకుండా కూడా కొన్ని రోజులు గడిచిపోయేవి. తను ఉదయం లేచే ముందే ఆఫీసుకో, బయటికో వెళ్ళి, తను నిద్రపోయిన తర్వాత ఎపుడో నేను ఇంటికి చేరడం జరిగేది. ఈ రకమైన కాలంలో నన్ను కవిగా బతికించింది దాట్ల దేవదానం రాజు స్నేహం. నేనెంత వత్తిడిలో వున్నా ప్రతి సాయంత్రం దేవదానం రాజుగారు నేను తప్పక కలిసేవాళ్ళం. వస్తున్న సాహిత్య ధోరణుల్ని ప్రస్తావించేవారు. ఆయన ఆత్మీయత, ఆయన స్నేహంలో వున్న స్వచ్ఛత, నిర్మలత దాంతో ముడివడివున్న సాహితీ చర్చలు ఎంత వత్తిడినైనా నేను వెంటనే మర్చిపోయేలా చేసేవి. వయసులో నాకన్నా సుమారు ఇరవై ఏళ్ళు పెద్ద అయిన దాట్ల దేవదానం రాజుగారు నాకు స్నేహితుడు, తాత్వికుడూ, దార్శనికుడుగా వ్యవహరించేవారు. ఈ స్నేహం ద్వారా అత్యధికంగా లాభపడింది నా కవిత్వం.
యానాం ద్వారా నాకు చేకూరిన మరొక వరం ఇస్మాయిల్ సాంగత్యం. ఇస్మాయిల్ గారు పుట్టి పెరిగింది యానాం పక్కన ఇంజారం గ్రామం. అందుకే యానాం రావడం ఇస్మాయిల్ గారికి అత్యంత వుత్సాహంగా వుండేది. యానాంకి పాతిక కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ వుండటం వలన ఇస్మాయిల్ గారిని నేను తరచు కలవడం, ఆయనకి యిష్టమైతే యానాం తీసుకు రావడం జరిగేది. గోదావరితీరం, పుట్టినవూరిలాంటి వాతావరణం. ఒకసారి యానాం వస్తే ఇస్మాయిల్ గారు రెండుమూడు రోజులైనా వుండేవారు. పైగా ఆ ప్రాంతపు అధికారిగా నా ఆతిధ్యం వలన ఆయనకి రాజమర్యాదలు జరిగేవి. ఇస్మాయిల్ గారు ఆయన మిత్ర ప్రముఖుల్ని కూడా తోడ్కొని యానాం వచ్చేవారు. త్రిపుర, సదాశివరావు, వగైరా మిత్రులతో యానాంలో సాహిత్యవాతావరణం వెల్లి విరిసేది. ఏదైనా పని ఒత్తిడిలో వారికూడా నేను వుండలేకపోతే దాట్ల దేవదానం రాజుగారు నేను లేని లోటు తెలవకుండా చూసేవారు. రెండేళ్ళపాటు యీ రకమైన సాంగత్యం నిరాటంకంగా సాగింది. ఈ రకమైన సంధర్భంలో నేను యానాం నుంచి బదిలీ కావడం జరిగింది. చాలా అకస్మాత్తుగా పాండిచ్ఛేరికి బదిలీ కావడం, ఆ సమయంలో మా అబ్బాయి పుట్టడం వలన కాకినాడ ఆసుపత్రిలో మా శ్రీమతి చేరి వుండటం అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులకి గురిచేశాయి. ’ఇసకగుడి’ కవితా సంకలనం యీరకమైన నేపథ్యంలో బయటికొచ్చింది. ఈ సంకలనం రావడానికి దాట్ల దేవదానం రాజుగారి పట్టుదల కారణం. ఆయన పట్టుపట్టకపోయివుంటే ఆ సమయంలో ఆ కవితా సంకలనం వచ్చివుండేది కాదు. ’ఇసుకగుడి’ మీద వచ్చిన సమీక్షలు, నా కవిత్వ యాత్రలో గొప్ప మలుపుగా నిలిచాయి. నాదంటూ ఒక పాఠకలుని, యీరకమైన కవిత్వానికి తనదైన స్థానాన్ని ’ఇసుకగుడి’ సమకూర్చింది. ’ఇసుకగుడి’ తీసుకురాడానికి మూలస్తంభాలుగా నిలిచిన ఇస్మాయిల్ గారికి, దాట్ల దేవదానం రాజుగారికి సదా ఋణపడి ఉంటాను.
మళ్ళీ పాండిచ్చేరికి
యానాం నించి పాండిచ్చేరికి నా తిరుగు ప్రయాణం సజావుగా సాగలేదు. కాకినాడలో మా శ్రీమతి, అప్పుడే పుట్టిన మా అబ్బాయి యిద్దరూ ఆరోగ్యకారణాల రీత్యా ఆసుపత్రిలో వుండటంతో కాకినాడలో ఒక యిల్లు తీసుకుని నెలరోజులు వుండాల్సి వచ్చింది. అక్కడ్నించి విజయవాడలో మజిలీ చేసినపుడు మా నాన్నగారు అర్థాంతరంగా మరణించడం వలన అక్కడ రెండునెలలు వుండాల్సి వచ్చింది. ఈ అనుకోని మజిలీల వలన నేనూ నా కుటుంబం, అనేక అవస్థల్ని తట్టుకోవాల్సి వచ్చింది. ఈ రకంగా నా కుటుంబం సామానుతో పాటు వయా కాకినాడ, విజయవాడ నెలల పాటు మజిలీలు చేసి ఆఖరుకి పాండిచ్చేరి చేరడం జరిగింది.

నా చిన్నతనంలో మా నాన్నగారు ఇరిగేషన్ శాఖలో సూపర్ వైజరుగా పనిచేసినపుడు ప్రతి సంవత్సరం ఒక కొత్త వూరికి బదిలీ అయేది. ప్రతి సంవత్సరం కొత్త స్కూలు కొత్త స్నేహితుల్ని కలవడం మళ్ళీ విడిపోడం బాగా అలవాటయిన నాకు కొత్త మజిలీలంటే ఆసక్తి ఉండేది. అయితే యానాం నుంచి పాండిచ్చేరికి బదిలీ యీ ఆసక్తిని చంపేసింది. నేనూ నా కుటుంబం నానా అవస్థలు పడి చివరికి పాండిచ్చేరి చేరాకా ఇక ఎన్నడూ పాండిచ్చేరి దాటి బదిలీ అనేదే వద్దురా బాబూ అన్నంతగా బదిలీల మీద విరక్తి కలిగింది. పాండిచ్చేరిలో యానాం కన్నా ఎక్కువ నాకు విరామం దొరకడం రాజధాని నగరం కావడంతో అన్నీ మనమే అన్న వత్తిడి కాకుండా, తక్కువ బాధ్యత దానికి తగిన విధంగా తక్కువ పనివత్తిడి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేది. అదేరకంగా సాయంత్రం ఆరయేసరికి యింటికి చేరి మా అబ్బాయితో షికారుకి వెళ్ళడం, కుటుంబపరమైన ప్రత్యేక సమయాలని అనందించడం మొదలైంది. రెండు సంవత్సరాల పాటు పాండిచ్చేరిలో ఉద్యోగం, కుటుంబపరమైన స్థిరత్వం, మా అబ్బాయితో ఆడుకున్న సాయంత్రాలు నా జీవితంలో అత్యంత సంపూర్ణత చేకూర్చిన సందర్భాలు. ఒక సుదూరమైన అన్యభాషా ప్రాంతానికి ఉద్యోగరీత్యా వలసవచ్చి, యీ ప్రాంతంలో ఒకడిగా స్థిరపడ్డ నాకు పాండిచ్చేరి నగరం అంటే అవ్యాజమైన అనురాగం ఏర్పడింది. నా జీవితంలో అత్యంత అందమైన అనుభవాలన్నీ యీ నగరంలో జరగడం, మనశ్శాంతి, ఆత్మశాంతిని చేకూర్చిన నగరం కావడం వలన నా కవిత్వంలో పాండిచ్చేరి నగరం ప్రముఖంగా ప్రస్తావించబడింది.
నేనెందుకు రాస్తున్నాను ?

వర్షబిందువు ఆకాశం నించి, రాలి ఎలా జలపాతమై ప్రవహిస్తుందో అలాగే నాలో కవిత్వం అంకురించి, జీవితానికి సమాంతరంగా ప్రవహిస్తోంది. వర్షబిందువుని నువ్వు ఎందుకు కురుస్తున్నావని అడిగితే ఏం చెబుతుంది? కురవడం నా సహజ తత్వం అని చెబుతుంది. వర్షించకుండా వుండలేనని చెబుతుంది. అలాగే కవిత్వం రాయడం నా సహజ తత్వం. రాయకుండా వుండలేను. కురవడం లేకుండా వర్షానికి అస్థిత్వం ఎలా లేదో, కవిత్వం లేకుండా నాకు అస్థిత్వం లేదు. కవిత్వం రాయకుండా జీవితాన్ని ఊహించుకోలేను.
- ఆకెళ్ళ రవిప్రకాష్ 

No comments:

Post a Comment