Saturday, February 17, 2018

నగరం నా దేహం

 నగరం నరనరాలుగా
 వ్యాపించిన నా దేహం.
 వూళ్ళన్నీ తిరుగుతూ
 సాగిన బతుకు ప్రయాణం
 ఒక అపరిచిత జ్నాపకంలోకి
 నను మేలుకొలుపుతుంది.
 నగరం జీవితపు
 అన్ని తలుపుల్నీ తెరుస్తుంది.

నా కళ్ళు తెరుచుకున్నపుడు
 మూసుకున్నపుడు
 తన అడుగుల్ని నగరం
 నాకు వినిపిస్తూనే వుంటుంది.
 నగరం ఎల్లపుడూ
 నాకోసం చేతులు చాస్తూనే వుంటుంది.
 తన బంగారు పావురాల రెక్కల్ని
 నా మీదకి విసురుతూనే వుంటుంది.

వేసవిలో నురగలు గక్కుతున్న
 సముద్రంలా హసిస్తుంది.
 నేనెక్కి దిగిన మెట్లనీ
 కలిసి విడిపోయిన తీరాల్ని
 అనామక మధ్యాహ్నాల్ని
 నిగూఢంగా, సున్నితంగా
 పూల వుపరితలపు
 మంచుబిందువులా స్పర్శిస్తుంది.

నగరం పాదాలు
 గాలి మీద
 నీళ్ళ మీద
 భూమి మీదా
 ఎల్లపుడూ నావేపే
 ప్రవహిస్తూంటాయి.
 నరనరాలుగా వ్యాపించిన
 నా దేహం యీ నగరం.

అలలు ఎగసిపడతాయి,
 విత్తనాలు మొలకెత్తుతాయి,
 నగరం చేతులు
 నీడల్ని అవతలికి తోస్తూ వుంటాయి,

పూల సుగంధాల్నీ
 మట్టి పరిమళాల్నీ
 సముద్రవాసనల్నీ
 ఆస్వాదిస్తూనే వుంటాను,
 ఆత్మకీ, నీడలకీ
 మధ్య దట్టంగా
 వ్యాపించిన నా అస్తిత్వం యీ నగరం.

నగరపు దేహం మీద
 సంచరించే
 ముడతలు పడ్డ
 అవ్యక్త సూర్యుళ్ళనీ
 చలనం లేని లోహపు కాలాన్నీ
 తుఫాను విప్పని నిశ్శబ్దాన్నీ
 బల్లపరుపు సముద్రాన్నీ
 రోజూ చూస్తూనే వుంటాను.

నగరం ఒక్కోసారి
 ఎటుపడితే అటు ప్రవహిస్తుంది,
 తనలోతనే సుడులు తిరుగుతుంది,
 రాళ్ళ పాఠాలు నేర్చుకుంటుంది.
 అన్ని రంగుల్లో
 కోరికల్ని ప్రదర్శిస్తుంది.
 నిజానికి నగరానికి
 తనదైన
 కాంతివంతమైన అందం లేదు,
 కాసేపు వుదయం నించీ
 కాసేపు వెన్నెల నించీ 
సముద్రం నించీ
 అందాన్ని అప్పు తెచ్చుకుంటుంది.

అలల మధ్యలో
 నీటి వాలు కిరణాల్లో
 రాతిపొరల అంచుల్లో
 నను వదిలి తను వెళిపోతుంది.

రోజంతా అలంకరణలు ఏవీ లేనట్టు నటించినా,
 సాయంత్రానికి
 దీపాలకాంతిని
 మెళ్ళోహారంలా ధరిస్తుంది.

ఇరుకు సందుల
 పూరిగుడిసెల
 వాకిళ్ళ ముందు
 నీళ్ళ వాసన లేని
 ప్లాస్టికు బొమ్మలా
 నోరు వెళ్ళబెడుతుంది నగరం.

కృత్రిమ పళ్ళనీ
 చిత్తడి రొమ్ముల్నీ
 బురద పాదాలనీ
 గంధకపు వాసనల్నీ చూసి
 నగరపు నిజరూపం
 దర్శనమవుతుంది.

ఇక సినిమాహాళ్ళలోకి
 సలూన్లలోకీ
 షాపింగుమాళ్ళలోకి
 అసహనంగా గొంతెండి నడుస్తాను.

నగరం నరనరాలుగా
 వ్యాపించిన నా దేహం.
 రాత్రి ఆకాశంలోకి నగరం
 దట్టంగా సుడులు తిరుగుతుంది,
 గాలిస్పర్శకోసం
 చేతులు చాస్తుంది.
 నగరపు ఏకాంత సామ్రాజ్యాన్ని
 ద్రాక్షబిందువులా తడుముతుంది వర్షం.

తడి ఆకుల బరువు గోడల్ని
 భూగోళం పరిభ్రమించే
 రహదారుల దారాల్నీ కలుపుతూ
 నీడల్నీ, మంచుకొండల్నీ
 అనంతంగా లాగుతూ
 ఇక ఎక్కడికీ కదలక ఒకేచోట
 స్థిరపడ్డ బతుకు రైలులా
 వుంటుంది నగరం.

జీవితం మొన మీద
 ప్రశ్నిస్తున్న నక్షత్రాలకి
 నీడల మీద మూసిన తలుపులకీ
 నే చెప్పిన ఒకే ఒక్క
 జవాబు యీ నగరం.
 నగరం ఒక్కోసారి 
విలపిస్తున్న వృద్ధాప్యం అవుతుంది,
 నగరం ఒక్కోసారి
 పిల్లల గావుకేక అవుతుంది,

నగరం ఒక్కోసారి
 కలలు ఎండిన ఎడారి అవుతుంది,
 ఎండుటాకుల పరాయి దేశాల
 వలస వాసన అవుతుంది.
 దూరాన్నీ కాలాన్నీ
 సముద్రాన్నీ
 మింగేస్తుంది నగరం
 శిశిరపూ గ్రీష్మపూ అసంగతాల మధ్య
 పరుచుకున్న మొండి కత్తిలా
 వుంటుంది నగరం.

నగరం ఎల్లపుడూ
 ఒక ముల్లులాటి సందిగ్ధత,
 ఎడతెగని సంక్లిష్టత,
 రాత్రుళ్ళూ, తుఫానులూ
 సుడులు తిరిగి
 కొండల మీద మంచు కరిగి
 గడియారాలన్నీ
 రాయిలాగా మారినపుడు
 కాలుతున్న శూన్యాలూ,
 ఏకాంతాల నీడల మధ్య లోలకంలా
వేళాడుతుంది నగరం.

నగరం నరనరాలుగా
 వ్యాపించిన నా దేహం.
 జనన మరణాల జాడ ఎవరికి తెలుసు,
 ఈ నిరంతర ప్రయాణంలో
 నా అంగాంగాలతో
 అలుపు లేకుండా
 చెలిమి చేసిన
 ఎడతెగని మజిలీ యీ నగరం,
 ఈ నగరం నా దేహం.

(పాండిచ్చేరి నగరానికి)

- ఆకెళ్ళ రవిప్రకాష్ - ప్రేమ ప్రతిపాదన నుంచి

No comments:

Post a Comment