Wednesday, February 22, 2017

నా శాంతినికేతన్‌ యాత్ర - ఆకెళ్ళ రవిప్రకాష్‌


               రవీంద్రనాథ్‌ టాగోర్‌ పేరు వినని, ఆయనెవరో తెలీని బెంగాలీలు ఎవరూ వుండరు. భారతదేశంలో బెంగాల్‌ దాటి యితర రాష్ట్రాల్లో అంతోయింతో చదువుకున్న అందరికీ రవీంద్రుడి గురించి తెలియడం తథ్యం. ఏ భాష వారైనా కవులూ, రచయితలు, కళాకారులైనవారు రవీంద్రుడి రచనలు చదివి స్ఫూర్తి చెందటం తప్పనిసరిగా జరిగే విషయం. భారతదేశంలో ఏ కవికీ యింత పేరు, గుర్తింపు, ప్రపంచ భాషలన్నిటిలోనూ, దేశాలలోనూ యిన్ని భాషల్లోకి అనువదింపబడిన కవి యింకొకరు లేరు. మనిషి పుట్టుకనించీ, భాష పుట్టిన నుంచి, మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో యింతగా కీర్తింపబడిన కవి, యింత ప్రాచుర్యం పొందిన కవి, ఒక దేశపు సాహిత్య సాంస్కృతిక యితిహాసంలో మూలవిరాట్టుగా కొలచిన, యింకా కొలువబడుతున్న కవి, తాత్త్వికుడు యింకొకరు లేరు. ఇలాటి మహాకవి తన జీవితంలో అత్యధికభాగం గడిపిన శాంతినికేతనాన్ని దర్శించడం ఎవరికయినా ఒక మంచి అనుభవం. కవిత్వం రాసే ప్రతివారికి రవీంద్రుడు గడిపిన స్థలం స్ఫూర్తినివ్వడం సహజం.


ఒకే గమ్యం రెండు యాత్రలు

               ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో కుటుంబంతోపాటు నేను కలకత్తా సందర్శించడం జరిగింది. అపుడు మొదటిసారి నేను శాంతినికేతనం వెళ్ళడం జరిగింది. నవంబరు నెలలో సాహిత్య అకాడమీ వారు 24 భాషల నుంచి కవులనీ, రచయితలనీ టాగోర్‌కి 150 సంవత్సరాలు నిండిన సందర్భంగా శాంతినికేతనాన్ని, రవీంద్రుడు నివసించిన జోరాసంకో భవనాన్ని చూపించడానికి నిర్ణయించుకుని తెలుగునించీ నన్ను ఎంపిక చేయడం జరిగింది.

               ఆ విధంగా శాంతినికేతనాన్ని ఆరునెలల వ్యవధిలో రెండవసారి దర్శించడానికి అవకాశం కలిగింది. ఒకసారి కుటుంబంతోనూ, యింకోసారి 24 మంది వివిధ భాషా కవులతోను శాంతినికేతనాన్ని సందర్శించడం వలన అదీ ఒకసారి వేసవిలోనూ, యింకోసారి చలికాలంలోనూ జరగడం వలన, ఆ ప్రదేశం గురించి అనుభూతి చెంది ఆనందించగలిగే అవకాశం దొరికింది.

 శాంతినికేతనం చరిత్ర : పాఠశాల స్థాపన

               1863లో రవీంద్రుడి తండ్రి మహర్షి దేవేంద్రనాథ్‌ టాగోరు రాయపూరు మహారాజు నుంచి బోల్‌పూర్‌ అనే ప్రాంతంలో కొంత భూమి కొనుగోలు చేసాడు. ఈ స్థలం ద్వారా ఒకసారి మహర్షి పయనిస్తున్నప్పుడు యిక్కడ ఆయనకి కలిగిన దివ్యానుభూతికి గుర్తుగా యీ స్థలాన్ని ఆయన కొన్నారని ప్రతీతి. ఇక్కడ ఆయన ఒక రెండస్థుల భవనం కలకత్తాలోని జోరాసంకో భవనం లాగా కట్టి, కుటుంబ సభ్యులకీ, స్నేహితులకూ ప్రార్థన కోసం వుపయోగపడే విడిదిగా ఉద్దేశించారు. రవీంద్రుడు తన కుటుంబ జమీందారీని చూసుకోడానికి 1890లో యిప్పుడు బంగ్లాదేశంలో వున్న 'షిలైడాహ్‌' అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ పద్మనది ఒడ్డున ఎన్నో పద్యాలు, కథలు రాసాడు. పిల్లలు మరీ చిన్నవారవటంతో రవీంద్రుడు భార్యనీ పిల్లల్ని షిలైడాహ్‌కి తీసుకునివెళ్ళలేదు. షిలైడాహ్‌లో వున్నపుడు మాత్రమే రవీంద్రుడికి పేదరికం గురించి, భారతంలో గ్రామాల పరిస్థితి గురించి అవగాహన కలిగింది. విద్య లేకపోవడం, ఆధునిక పరిజ్ఞానం లేకపోవడం వలన దేశం ఎంత వెనకబడిపోతుందో మొదటిసారి రవీంద్రుడు గ్రహించడం జరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక పాఠశాల తెరవాలని, అదీ భారత సాంప్రదాయక పద్ధతులని, ఆధునిక పరిజ్ఞానాన్ని ఒకచోట చేర్చే రకంగా వుండాలని అతని ఆశయం. ఈ విషయం దేవేంద్రనాథుడికి తెలియపరిచినప్పుడు, ఆయన బోల్‌పూర్‌ ఎస్టేట్‌లో వున్న శాంతినికేతనం యీ రకమైన ప్రయత్నానికి అనువైన ప్రదేశంగా వుంటుందని చెప్పడంతో 1901లో శాంతినికేతనానికి రవీంద్రుడు మకాం మార్చి పాఠశాలని ప్రారంభించాడు. కలకత్తాలో వున్న తన భార్య మృణాళినీ దేవిని, తన పిల్లలతో బాటు, శాంతినికేతనంలో వున్న రెండతస్థుల భవంతిలో గడపడం ప్రారంభించాడు. శాంతినికేతనానికి, తదుపరి విశ్వభారతి విశ్వవిద్యాలయానికి యీ స్థలమే అత్యంత ముఖ్యమైనది. రవీంద్రుడు ప్రారంభించిన పాఠశాల యిప్పటికి వంద సంవత్సరాలు దాటి ఒక దశాబ్దం పూర్తిచేసుకుంది.

1901లో టాగోర్‌ కేవలం అయిదుమంది పిల్లలతో యీ పాఠశాల ప్రారంభించాడు. అందులో ఒక విద్యార్థి ఆయన కొడుకు. అసలెందుకు టాగోర్‌ పాఠశాల ప్రారంభించాలని అనుకుని వుంటాడు? మెకాలేతో ప్రారంభమయిన బ్రిటిషు విద్య అప్పటి బెంగాలులో తన ఇనుప పాదంతో భారతీయ సాంప్రదాయిక విలువల్ని తుడిచిపెడుతున్న సందర్భంలో భారతీయ గురుకుల సంప్రదాయంలో, ప్రకృతికి అతిదగ్గరగా, గురుశిష్యుల మధ్య ఆత్మీయ అనుబంధానికి పెద్దపీట వేస్తూ టాగోర్‌ విద్యాబోధనలో వేసిన చిన్న అడుగు యిప్పుడు విస్తృతంగా వ్యాప్తి చెంది శాంతినికేతనంలో మనకి కన్నుల పండుగ చేస్తుంది. టాగోర్‌ యీ పాఠశాలని కలకత్తాలోనే ఎందుకు ప్రారంభించలేదు? కలకత్తాకి వందల కిలోమీటర్ల దూరంలో మారుమూల పల్లె బోల్‌పూర్‌ని ఎందుకు ఎంచుకున్నాడు? బహుశ తన ప్రయోగాత్మక పాఠశాలను నగరం యొక్క రణగొణధ్వనులనించీ దూరంగా, అన్ని రకాల కాలుష్యాలనించీ దూరంగా వుంచడానికి యీ స్థలం ఎంచుకుని వుండవచ్చు. ఈ రోజుకి కూడా శాంతినికేతనంగా పేరుపడ్డ గ్రామం బోల్‌పూర్‌లో ప్రకృతికీ మనిషికి దూరం బహు తక్కువ. ఇలాంటి ప్రదేశంలోనే, పిల్లలు వివిధ రుతువుల ఆగమనాన్ని గమనించగలరు. వర్షంలో తడవగలరు. వెన్నెల రాత్రుళ్ళని అనుభవించగలరు. ఇక్కడ తరగతులు కూడా చెట్ల కింద జరుగుతాయి. వర్షం వస్తే మటుకు కొంతసేపు ఎదురుచూడడానికి పర్ణశాలలూ, కుటీరాలూ కొన్ని దగ్గరలో వున్నాయి. ఈ క్లాసుల్లో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి పీరియడ్‌ తరవాత పిల్లలు తాము కూర్చునే స్థలం మార్చుకుంటారు. సంగీతం, నాట్యం, నాటకాలకి సిలబస్‌లో సముచిత స్థానం వుంటుంది. పిల్లలు తమ యిష్టాల్ని అభివ్యక్తం చేసుకోడానికి ప్రాముఖ్యం వుంటుంది. ప్రతి మంగళవారం కవిత్వసదస్సులు జరుగుతాయి. అందులో పిల్లలు తమ కవితలు, కథలు, పాటలు, నాట్యాలు ప్రదర్శించవచ్చు. అలాగే తోటపని, చేతివృత్తుల్ని నేర్చుకోవడం ద్వారా దేహానికి, బుద్ధికి తగిన విధంగా వుపయోగించుకోవడానికి ప్రాధాన్యం వుంటుంది. ఆదివారం కాకుండా బుధవారం వారంలో శలవుగా వుంటుంది. ప్రతి రుతువుల ఆగమనానికి తగ్గట్టు ఒక పండుగని యిక్కడ చేసుకుంటారు. పిల్లలకి ప్రకృతిలో వచ్చే భిన్న మార్పుల్ని తెలియజేయడమే యీ పండుగల వుద్దేశం. తరచు పిల్లలని చుట్టూవున్న గ్రామాలకి తీసుకువెళ్ళి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయడం, వారి చదువులో భాగం. ఉదయం ఏడుగంటలనించీ పన్నెండున్నర వరకు చదువు. సాయంత్రం ఆటపాటలు యిలా సాగుతుంది. ప్రతి విద్యార్థి ఒక పూలతోటని పెంచాలి. ఆ పూలతోట ఎలా పెరుగుతుంది అది కూడా అతని చదువులో భాగమే. అధ్యాపకులు తరచుగా విద్యార్థులతో తమ అనుభవాలన్నీ పంచుకోవాలి. జీవితంలో తాము నేర్చుకున్న అనేక జీవితానుభవాల్ని విద్యార్థులకి తెలియజేయాలి. కర్మ ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ప్రేమ, ప్రేమ ద్వారా విశ్వశ్రేయస్సు యిది యీ పాఠశాల ద్వారా పిల్లలకి బోధించబడేది. టాగోర్‌ భావించింది ఏమిటంటే యీ లక్షణాలన్నీ పిల్లలలో పుష్కలంగా వుంటాయి. యివి జాగృతం అయి పరిపూర్ణంగా ప్రకటించబడాలంటే దానికి తగిన వాతావరణం మనం కలగచేయాలి. శాంతినికేతనం యిటువంటి వాతావరణాన్ని పిల్లలకి యివ్వాలని, కవి యొక్క కల. ఈ పాఠశాలలో వున్న యింకో ప్రత్యేకత, యిక్కడ ఏ మతానికి చెందిన ప్రార్థనలూ జరగవు. కేవలం టాగోర్‌ రాసిన సర్వమతాలూ పాడుకోగలిగిన ఆధ్యాత్మిక గీతాలు మటుకు ఆలపింపబడతాయి. పాఠశాలల్లో ఏ రకమైన మతబోధన జరగకూడదని టాగోర్‌ అభిప్రాయం. పిల్లల హృదయాల్లో అనంతం గురించి ఒక ప్రేమభావన కలిగించాలి తప్ప ఏ రకమైన మతపరబోధన జరగరాదని టాగోర్‌ విశ్వాసం. ఈ ప్రాంగణంలో యీ యిల్లు, పాఠశాల కోసం నిర్మించిన చెట్ల క్రింద తరగతులూ, ఒక సర్వమత ప్రార్థనామందిరమూ వున్నాయి. ఇదే క్యాంపస్‌లో 'గౌర్‌' ప్రాంగణం ఉంది. ఇది శాంతినికేతనానికి గల ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం, అన్ని ప్రదర్శనలూ యిక్కడే జరిగేవి, ఇంకా జరుగుతున్నాయి. ఈ గౌర్‌ ప్రాంగణంలోనే 24 మంది కవులకీ, యితర ముఖ్యులకీ బంగ్లాదేశ్‌ సాంస్కృతిక బృందంచే ప్రదర్శనలు చూపించింది. ఇక్కడే నాకిష్టమైన బంగ్లాదేశ్‌ పాప్‌ గాయకుడు ఆర్నబ్‌ని నేను కలిసినది కూడా.

శాంతినికేతనం : విశ్వభారతి విశ్వవిద్యాలయం

               డిశంబరు 1918లో విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా దాన్ని తీర్చిదిద్దాలని టాగోర్‌ ఆశ. సంస్కృతులన్నీ, కళలన్నీ ఒకచోట సంగమించే ప్రదేశంగా దాన్ని వుద్దేశించాడు. కులం, మతం, తరతమ భేదాలు లేక ప్రపంచ మానవుల్ని తీర్చిదిద్దాలని ఆయన ఆశ. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వెంటనే టాగోర్‌ ప్రపంచ యాత్ర చేసాడు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్సు, జర్మనీ, హాలాండ్‌, బెల్జియమ్‌, నార్వే, స్వీడన్‌, జపాన్‌ తదితర దేశాల్ని సందర్శించి, అక్కడవున్న గొప్ప కళాకారుల్ని, స్కాలర్లనీ విశ్వభారతి సందర్శించమని ఆహ్వానించాడు. విశ్వభారతి నిర్మాణానికి టాగోర్‌ తన దగ్గరవున్న సమస్తం వుపయోగించాడు. చివరికి నోబుల్‌ బహుమతి ఇచ్చిన డబ్బు, శాంతినికేతనం కోసం వచ్చిన డొనేషన్లు, తన ఆస్తి, సమస్తం విశ్వభారతికి కానుకగా యిచ్చాడు. ఈ వనరులతో కొత్త భవనాలు, విద్యాభవనం, కళాభవనం, సంగీత భవనం, శిల్ప భవనం, చైనా భవనం, హిందీ భవనం యిలా వేర్వేరు భవనాలు నిర్మించి, కొత్త శాఖల్ని ఏర్పరచడం జరిగింది. ఈ నిర్మాణాలన్నీ సుమారు 1921 నాటికి పూర్తయ్యాయి. టాగోర్‌ విశ్వభారతిని దేశానికి అంకితం చెయ్యడం జరిగింది.

               తన సమస్తం అర్పించి యిలా ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంలో టాగోర్‌ వుద్దేశం ఏమయి వుంటుంది? విద్య ఒక దేశం యొక్క అభివృద్ధికి చిహ్నం. టాగోర్‌ ఒక అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తన దేశానికి ఒక దారి చూపించాడు. ఇది ఏదో బ్రిటీషువారు ఏర్పరచిన విద్యావిధానం కాకుండా, భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, కళల్ని కాపాడుకుంటూ విజ్ఞానాన్ని యిస్తూ విశ్వమానవుల్ని తయారుచేయడం ఆయన వుద్దేశం.  విశ్వభారతి విశ్వవిద్యాలయం చుట్టూ తిరిగి పరిశీలిస్తే, దానియొక్క ప్రత్యేకత యీనాటికీ కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

శ్రీనికేతన్‌

               గ్రామీణ భారతాన్ని పునర్నిర్మించడానికి టాగోర్‌ చేసిన కృషి చాలామందికి తెలీదు. నిజానికి శాంతినికేతనం 1901లోను, విశ్వభారతి 1921లోను నిర్మించడానికి తను పుట్టి పెరిగిన కలకత్తాని వదిలేసి మారుమూల ప్రాంతమైన వీర్‌భూమ్‌ జిల్లా, బోల్‌పూర్‌ని ఎంపిక చేసుకోవడంలోనే ఆయనకి గ్రామీణప్రాంతాలమీద వున్న మక్కువకి నిదర్శనంగా నిలుస్తుంది. 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయంతోబాటు గ్రామీణ పునర్నిర్మాణ కేంద్రం అనే 'శ్రీనికేతన్‌'ని కూడా ఆయన ప్రారంభించాడు. ఇటువంటి గ్రామీణ అభివృద్ధి చేయాలని ఆశ ఆయనకి 1890లో మొదటిసారి కలిగింది. తూర్పు బెంగాల్‌లోని సిలైడాహ్‌లో తమ జమీందారీకి మేనేజరుగా పనిచేసిన కాలంలో అక్కడ గ్రామీణ ప్రాంతాల పేదరికాన్ని చూసి టాగోర్‌ చలించిపోయాడు. ఈ సిలైడాహ్‌ నదియా జిల్లాలో, పద్మానది ఒడ్డున వుంది. అప్పటివరకు టాగోర్‌ కలకత్తాలో మటుకు నివసించాడు. కవిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. పేదరికం అంటే ఏమిటో మచ్చుకి కూడా తెలీదు. ఆ సమయంలో సిలైడాహ్‌ నించీ నది ద్వారా చిన్న కాలువల ద్వారా మారుమూల గ్రామాలని సందర్శించాడు. అక్కడి ప్రజల జీవన వ్యవహారాల్ని, దైనందిన చర్యల్నీ అతిదగ్గరగా గమనించాడు. వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ పేదరికాన్ని అతిదగ్గర్నుంచీ చూసిన తరువాత జమీందారుగా వాళ్ళ దగ్గర్నుంచీ డబ్బు వసూలు చేయడానికి తన మీద తనకే ఏవగింపు కలిగింది. అదే సమయంలో యిటువంటి పేద ప్రజలకి ఏదేనా మంచి చెయ్యాలని సంకల్పం కూడా కలిగింది. టాగోర్‌కి సమస్య యొక్క స్వరూపం అతిపెద్దదిగాను, వ్యక్తిగతంగా తన వద్ద గల వనరులు అతితక్కువగానూ గోచరించాయి. అలాంటి సందర్భంలో తనకి తాను ఒక వాగ్దానం చేసుకున్నాడు. ఇన్ని వేల లక్షల గ్రామాల్లో, కనీసం ఒక్క గ్రామాన్ని నిస్సహాయతనించీ, అజ్ఞానంనించీ, విద్యలేనితనాన్నించీ దూరం చెయ్యగలిగితే, మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శగ్రామం ఏర్పడుతుంది. అలాగ ఇంకొన్ని గ్రామాలు యిదే బాటలో నడుస్తాయి. ఈ రకంగా నిర్మించిన గ్రామాలు తన భారతదేశం తను కలలు గనే భారతదేశం. ఆ ఆదర్శ భారతంనించీ మిగతా దేశం అతిత్వరలో జాగృతమవుతుంది అని టాగోర్‌ సంకల్పించాడు.



               1901లో శాంతినికేతనం ప్రారంభించినప్పటినించీ, గ్రామీణ ప్రాంతంలో విద్య మీద దృష్టి పెట్టిన టాగోర్‌, యీ పాఠకుల విద్యాబోధనలో చుట్టూరావున్న గ్రామాల పునర్నిర్మాణాన్ని బోధనా విషయంగా చేర్చాడు. విద్యాబోధన ద్వారా గ్రామాలలో పిల్లలు సామాజిక సేవాకార్యక్రమాల్ని నిర్వహించేలా చూసి, చుట్టూరా గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డాడు. టాగోర్‌ తన అనేక ప్రపంచ యాత్రలలో అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయాన్ని గమనించాడు. వ్యవసాయంలో చిన్న చిన్న సాంకేతిక ప్రక్రియల ద్వారా ఉత్పత్తిని రెండురెట్లు మూడురెట్లు ఎలా పెంచుకోవచ్చో గమనించాడు. అలాగే పాల ఉత్పత్తుల్ని సాంకేతిక విజ్ఞానం ద్వారా ఎలా లాభదాయకంగా చేసుకోవచ్చో తెలుసుకున్నాడు. శ్రీనికేతనం ద్వారా వ్యవసాయం మరియు పశువుత్పాదనలను గ్రామ ప్రజలకి సాంకేతిక పద్ధతుల ద్వారా బోధించి పేదరికాన్ని నిర్మూలన చేయాలని టాగోర్‌ ప్రయత్నం. శ్రీనికేతన్‌, కేవలం తరగతుల్లో పుస్తకాలు చదివే కేంద్రంలా గాకుండా, నేర్చుకున్న విద్యని సమాజానికి వుపయోగపడేలా చేసే ఒక ప్రయోగాత్మక శాల. తద్వారా గ్రామీణ భారతం యొక్క పునన్నిర్మాణానికి నాంది. 1922 తర్వాత శ్రీనికేతనం యొక్క ఆదర్శ గ్రామీణ భారతం చుట్టుపక్కల వున్న 22 గ్రామాల వరకు విస్తరించి యీనాటికీ నిరాటంకంగా సాగుతోంది.

రవీంద్రుడి సదనం

               శాంతినికేతనం యిల్లుకి ఎదురుగా ఒక పెద్ద గృహసముదాయం వుంది. ఈ సముదాయంలోనే రవీంద్రుడి మ్యూజియమ్‌ వున్నది. ఇది 1961లో నిర్మించారు. ఈ మ్యూజియమ్‌లో కొన్ని రవీంద్రుడి చిత్రపటాల ప్రదర్శన కూడా వున్నది. ఈ లోపల రవీంద్రుడు నివసించిన రవీంద్రుడి ఇల్లు వుంది. ఈ యిల్లు రవీంద్రుడు తన అభిరుచులకు అనుగుణంగా భారత మరియు యూరోపియన్‌ సంప్రదాయాల్ని రంగరించి కట్టించుకున్నది. ఈ పెద్ద యిల్లు కాదు ఉద్యాన, ఆ చుట్టూతా చిన్న చిన్న యిళ్ళు అందులో ఒకటి మట్టి యిల్లు కూడా వున్నది. రవీంద్రుడు తన భావాలకి అనుగుణంగా యీ యిళ్ళలో నివసించేవాడట. అందులో ఒకటి తక్కువ ఎత్తుగల పైకప్పు కలది. ఇంకోటి బాగా ఎక్కువ కిటికీలు గలిగినది. ఈ యిళ్ళన్నీ రవీంద్రుడు తన అభిరుచులకి అనుగుణంగా కట్టించుకునేవాడట. ఇక్కడే రవీంద్రుడు వాడిన కారు కూడా అద్దాలలో బంధించి ప్రదర్శించారు.

ముగింపు


               రవీంద్రుడి జీవితం మొదట్నించీ చాలా స్ఫూర్తినిచ్చింది. కానీ ఆయన జీవించిన ప్రదేశాన్ని దగ్గరగా చూసి అనుభూతి చెందడం, ఆయన నిర్మించిన పాఠశాలని, విశ్వవిద్యాలయాన్ని దర్శించడం కవిగా నాలో కొత్త స్ఫూర్తిని ఉత్తేజాన్ని నింపింది. నాలోని విశ్వమానవుడ్ని మేలుకొలిపింది.

No comments:

Post a Comment