రాత్రిలోకి
కిక్కిరిసిన జనం.
క్షణాలు నిమిషాల్నీ
నిమిషాలు గంటల్నీ
నిర్దయగా చదువుతుంటాయి.
చీకటిలోకి చేతులు
చాస్తుంది
తలలా వేళాడుతున్న
గడియారం.
సామాన్లని భారంగా
యీడుస్తుాంటాయి చేతులు.
ఇంకా ఎంతకీ రాదు
నేనెక్కాల్సిన రైలు.
అసలెప్పుడైనా
కలగన్నానా
ఒక అపరిచిత ధ్వని
సముదాయంలో
అదే పనిగా
కొట్టుకుపోతానని?
వలయ వలయాలుగా
సాగుతున్న ప్రయాణంలో
ఒక అనుకొని
మజిలీలో యిలా రాత్రంతా మిగిలిపోతానని,
ఒక అజ్ఞాత
గాయకుడి తాత్విక గీతానికి
గుండె కరిగి
దుఃఖంగా మిగులుతానని.
భూగోళం చివరి
మైలురాయి దగ్గర ఎక్కడో
చిక్కడిపోయినట్టుంది
రైలుబండి.
జనంలోకి
చొచ్చుకుపోయిన రాత్రి
ఒక్కొక్కరి మౌనంలోకీ
ఒక్కొక్కరి అంతః
ప్రపంచంలోకీ
ఒక్కొక్కరి
నిద్రావస్థలోకి
వెలుగుతూ
ఆరుతుాంయి ఎరుపు పచ్చ లాంతర్లు.
దిగంతం ఇనప చట్రం
మీంచీ
అకస్మాత్తుగా
వూడిపడుతుంది రైలు.
మనందరి మూసి
వున్న కళ్ళ లోగిళ్ళూ
అతి కష్టంగా
తెరుచుకుాంయి,
చతికిలబడ్డ
ఆలోచనలన్నీ
సామాన్లని
తడుముకుంటాయి.
అమ్మా! నీ
దగ్గరికే వస్తున్నా
నీ చల్లని
చేతుల్లో కాసేపు
నా జీవన
భారాల్నన్నీ పక్కన పెట్టి సేదదీరడానికి,
నాన్న ఖాళీ చేసి
వెళ్ళిన
జన్మజన్మల
జ్ఞాపకాల్లోకి
అశాంతిగా కాసేపు
జ్వలించడానికి.
గడియారం అంచులకి
గుండె ముడేసుకుని
రాత్రిలోకి
ఎదురుచూస్తావు నా రాక కోసం.
- ఆకెళ్ళ రవిప్రకాష్
( ప్రేమ ప్రతిపాదన కవితా సంపుటి నుంచి )
No comments:
Post a Comment